హైదరాబాద్ లో ఈరోజు, రేపు సీడబ్ల్యూసీ సమావేశాలు

హైదరాబాద్ లో ఈరోజు , రేపు సీడబ్ల్యూసీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం సీడబ్ల్యూసీ సభ్యలకు టీపీసీసీ విందు ఇస్తుంది. విందు అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం సమావేశం అనంతరం బహిరంగ సభ నిర్వహించున్నారు.
ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ఐదు కీలక అంశాల మీద చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో మొదటిది త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం. 2. భారత్ జోడో యాత్ర నిర్వహణ 3. 2024 లోక్ సభ ఎన్నికలు 4. ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు 5. ఈనెల 18 నుంచి ప్రారంభం అవనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిల మీద కాంగ్రెస్ ముఖ్య నేతలు చర్చించనున్నారు. ఇవి కాకుండా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అదానీ వ్యవహారం, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఇండియా కూటమి చేపట్టాల్సిన పోరాటాలు వంటి విషయాలను కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తాజ్ కృష్ణ హోటల్లో జరగబోయే ఈ సమావేశాలకు ఖర్గే, సోనియా, రాహుల్ తో పాటు హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్‌సింగ్ సుఖు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సీడబ్ల్యూసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, ఏకే ఆంటోనీ, రమేశ్ చెన్నితాల, కొడుక్కునిల్ సురేశ్, శశిథరూర్, రణదీప్‌సింగ్ సూర్జేవాలా, రాజీవ్‌శుక్లా, పవన్‌ఖేరా, యశోమతి ఠాకూర్, దీపేందర్ సింగ్ హుడా, ఫూలోదేవి, లాల్జీదేశాయ్, తారిఖ్ అన్వర్, మీరా కుమార్, నెట్టా డిసౌజా, అల్కా లాంబా, బీకే హరిప్రసాద్, మాణిక్యం ఠాగూర్, ఇబోబిసింగ్, ప్రతిభా సింగ్, మనీశ్ తివారీ, గౌరవ్ గొగోయ్, భక్తచరణ్‌దాస్, సుప్రియా షినాటె, దిగ్విజయ్‌సింగ్, కుమారి షెల్జా పాల్గొననున్నారు. సీడబ్ల్యూసీ సభ్యులుగా తెలుగు రాష్ట్రాల నుంచి రఘువీరారెడ్డి, పల్లం రాజు, కొప్పులరాజుతోపాటు శాశ్వత ఆహ్వానితుడిగా దామోదర రాజనర్సింహా, ప్రత్యేక ఆహ్వానితుడిగా వంశీచంద్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతల హోదాల్లో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఈ సమావేశాలకు హాజరవుతారు.