రేపటి నుండి వరి దీక్షలు మొదలుపెట్టబోతున్న కాంగ్రెస్ పార్టీ

తెలంగాణ రాష్ట్రంలో వరి కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. గత కొద్దీ రోజులుగా తెరాస , బిజెపి మధ్య మాటల యుద్ధం నడుస్తూ వస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సైతం వరి ఫై పోరాటం మొదలుపెట్టింది. కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెండురోజుల దీక్షకు దిగుతోంది. శనివారం ఉదయం 10 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర వరి దీక్షకు సిద్ధమవుతున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా ముఖ్య నేతలు అందరూ ఈ వరి దీక్షలో పాల్గొంటున్నారు. 27న రాత్రి కొందరు నాయకులు ఇందిరా పార్క్‌ దగ్గరే ఉండనున్నారు. “దగా పడుతున్న ధాన్యం రైతులకు అండగా ఉందాం.. ప్రభుత్వాల మెడలు వంచుదాం.. అన్నదాతను ఆదుకుందాం” అనే నినాదంతో వరి దీక్ష చేపట్టింది కాంగ్రెస్‌. దీనికి పార్టీ కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చింది.

రాష్ట్రంలో రైతు సమస్యలకు కారణం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలే కారణమని రేవంత్ విమర్శించారు. ఈ రెండు పార్టీలు రైతులకు ద్రోహం చేస్తున్నాయన్నారు. తెలంగాణలో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆలస్యం వల్లే వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని అన్నారు.