మునుగోడులో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్

మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తే..బిజెపి రెండో స్థానంలో నిలిచింది. ఇక కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 11 ,666 ఓట్ల తేడాతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి నువ్వా నేనా అన్నట్లు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నడిచింది. దాదాపు 10 రౌండ్ల వరకు స్వల్ప మెజార్టీతో కనిపించిన టిఆర్ఎస్ పార్టీ..11వ రౌండ్ నుంచి స్పష్టమైన మెజార్టీ ప్రదర్శించింది. రెండు, మూడు, 15వ రౌండ్లలో మాత్రమే కమలం పార్టీ ముందంజలో నిలిచింది. మిగతా అన్ని రౌండ్లలో కారు దూసుకుపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఏ రౌండ్ లోను ఆధిక్యం కనపరచలేకపోయింది.

పోలింగ్ ముగిసే వరకు తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఫలితం చూశాక.. నోరెళ్లబెట్టింది. ఎన్నిక ఏదైనా మేము ఇంతే అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారైంది. మునుగోడు ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ కు ఆశించిన ఫలితం దక్కలేదు. పేరుకే తెలంగాణ ఇచ్చిన పార్టీ.. కానీ తెలంగాణ వచ్చాక ఏ ఒక్క ఎన్నికలోనూ సత్తా చాటింది లేదు. 2014 నుంచి పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. 2018 తర్వాత జరిగిన హుజుర్‌నగర్‌, దుబ్బాక, నాగార్జున్‌ సాగర్‌,హుజురాబాద్… ఇలా ఎన్ని ఉప ఎన్నికలు వచ్చినా ఉసూరుమనిపించింది. తాజాగా మునుగోడులో అదే తీరు ఫలితాలను మూటగట్టుకుంది. మొత్తంగా కలిపితే 20వేల ఓట్లు సాధించేందుకు కూడా అపసోపాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది.

దశాబ్దాలుగా వెన్నంటి ఉన్న సంప్రదాయ ఓట్లనూ కాపాడుకోవడంలో విఫలమైంది. పార్టీలో ఇంటర్నల్‌ ఫైటింగ్‌ దెబ్బకు… హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్ కూడా తలో దిక్కు చూసుకున్నారు. దెబ్బకు కాంగ్రెస్‌ ఓట్లన్నీ బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య ముక్కలు,చెక్కలైపోయాయి. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎపిసోడ్‌.. కాంగ్రెస్‌ కొంపముంచిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. పార్టీని పక్కనబెట్టి తన తమ్ముడికి సపోర్ట్‌ చేయాలంటూ కార్యకర్తలతో కోమటిరెడ్డి మాట్లాడిన ఆడియో… కాంగ్రెస్‌ గెలిచేది లేదు, సచ్చేది లేదు అంటూ ఆయన ఆస్ట్రేలియాలో మాట్లాడిన వీడియో… మీడియా,సోషల్‌ మీడియాల్లో వైరల్‌ కావడం కాంగ్రెస్‌ను మరింత కుంగదీసిందనేది రాజకీయవర్గాల నుంచి వినిపిస్తున్న మాట.

మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలోనే భారత్‌జోడో అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించడం… కాంగ్రెస్‌ శ్రేణులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ముఖ్య నేతలంతా రాష్ట్రంలో సాగుతున్న రాహుల్‌ పాదయాత్రపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చింది. పాపం.. పాల్వాయి స్రవంతి దాదాపు ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది. ప్రధాన పోటీదారులుగా మారిన టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య నిలదొక్కుకోలేకపోయారు.