కేసీఆర్ వెంటే తెలంగాణ అంటూ మంత్రి హరీష్ రావు ట్వీట్

Minister Harish Rao tweeted that Telangana is after KCR

Community-verified icon

మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంతో టిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 11 ,666 ఓట్ల తేడాతో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి నువ్వా నేనా అన్నట్లు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నడిచింది. దాదాపు 10 రౌండ్ల వరకు స్వల్ప మెజార్టీతో కనిపించిన టిఆర్ఎస్ పార్టీ..11వ రౌండ్ నుంచి స్పష్టమైన మెజార్టీ ప్రదర్శించింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఏ రౌండ్ లోను ఆధిక్యం కనపరచలేకపోయింది.

టిఆర్ఎస్ విజయం సాధించడం పట్ల రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ‌ మంత్రి హ‌రీశ్‌రావు ట్వీట్ చేశారు. కేసీఆర్ వెంటే తెలంగాణ ఉందంటూ మంత్రి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు ఓ ఫోటోను కూడా ట్వీట్ చేశారు. ఇక బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటమికి, టీఆర్ ఎస్ గెలుపునకు అనేక ఫ్యాక్టర్స్ పనిచేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎలక్షన్ ఇంజినీరింగ్ అద్భుతంగా చేయడం గులాబీ పార్టీకి కలిసి వచ్చింది. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చిందని, స్వలాభం కోసమే ఆయన బీజేపీలో చేరారనే ప్రచారాన్ని టీఆర్ఎస్ క్షేత్రస్థాయికి తీసుకెళ్లగలిగింది. ఎన్నికల ప్రకటన రాకముందే ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతు తీసుకోవడం టీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చింది. సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం, బీసీలకు తాయిలాలు ప్రకటించడం, కొన్ని నెలల ముందు నుంచే గ్రౌండ్ వర్క్ చేయడం, చివర్గో ఓటర్లకు ప్రలోభాల ఎర వంటివి టీఆర్ ఎస్ గెలుపునకు సహకరిస్తే.. బీజేపీ అభ్యర్థి ఓటమికి కారణమయ్యాయి.