అమర్‌నాథ్‌ వరదల్లో వందలమందిని కాపాడిన రిటైర్డ్ పోలీసు అధికారి మృతి

శుక్రవారం అమర్‌నాథ్‌ దేవాలయం వద్ద సంభవించిన భారీ వరదల్లో వందలమందిని కాపాడిన ..రిటైర్డ్ పోలీసు అధికారి అదే వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన సుశీల్ ఖాత్రి శ్రీగంగానగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఇంఛార్జీగా పని చేసి ఈ ఏడాది మార్చిలో రిటైరయ్యారు. అమర్‌నాథ్ యాత్ర కోసం జూలై 3న ఆయన శ్రీగంగానగర్ నుంచి బయల్దేరిన 22 బ్యాచ్‌లో ఆయన ఒకరిగా ఉన్నారు. వీరంతా అమర్‌నాథ్ గుహ సమీపంలో టెంట్లలో ఉండగా.. వరద మట్టం క్రమంగా పెరిగి కాసేపట్లోనే వారు ఉన్న టెంట్లను ముంచెత్తింది.

అమరనాథీశ్వరుణ్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు వరదలో కొట్టుకుపోవడం గమనించిన ఖాత్రి.. వెంటనే రంగంలోకి దిగి కొందర్ని కాపాడారు. కానీ వరద ఉధృతి ఎక్కువ కావడంతో.. నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఆయనతోపాటు ఆయన బంధువులు మోహన్‌లాల్ వాద్వా, సునీత వాద్వా సైతం ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురి మృతదేహాలను ఆదివారం హెలికాప్టర్‌లో శ్రీనగర్ నుంచి శ్రీగంగానగర్ తరలించారు. ఈ ఘటన తో శ్రీగంగానగర్ లో విషాద ఛాయలు అల్లుకున్నాయి.

కరోనా విజృంభణ తరువాత రెండేళ్ల పాటు అమర్‌నాథ్‌ యాత్రను ప్రభుత్వం నిలిపేసింది. ఈ ఏడాది మళ్లీ యాత్రకు భక్తులను అనుమతించింది. ఎత్తైన ప్రదేశం కారణంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్న ప్రయాణీకులకు తగిన ఏర్పాట్లు చేసింది. కాగా గత నాల్గు రోజుల క్రితం అమర్‌నాథ్‌ వద్ద భారీ వర్షం పడింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కొండలపై నుండి భారీ వరదలు ఒక్కసారిగా రావడం తో యాత్రికులు ఆ వరదల్లో కొట్టుకుపోయారు. ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా , ఉండడం..వర్షం లేకపోవడం అంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఏపీనుండి వెళ్లిన వారిలో ఐదుగురు గల్లంతయ్యారు. ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నారు.