సనాతన ధర్మం ఫై ఉదయనిధి వ్యాఖ్యలపై కాంగ్రెస్ లీడర్ ఆగ్రహం

సనాతన ధర్మం ఫై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిదని, నిర్మూలించాలంటూ ఉదయనిధి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే..మరికొంతమంది మద్దతు తెలుపుతున్నారు. ఏకంగా ఒక స్వామిజి అయితే హిందూ మతాన్ని ఇంతలా దూషించిన స్టాలిన్ తల నరికితే రూ. 10 కోట్లు ఇస్తానని ప్రకటించి సంచలనాన్ని సృష్టించాడు. ఇక దీనికి ఉదయనిధి స్టాలిన్ సైతం రండి ఎవరు వస్తారో నా తల కోసం అంటూ కౌంటర్ ఇచ్చాడు.

తాజాగా కేరళ కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేరా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు. సనాతన హిందూ ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎటువంటి పరిస్థితుల్లో సమర్ధించే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ప్రజల కోసమే ఉన్న కాంగ్రెస్ అన్ని కులాల, మతాలను సమానంగా చూస్తుందని అన్నారు. మరోపక్క సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని ఆవేదన వ్యక్తం చేసారు ఉదయనిధి స్టాలిన్. తన వ్యాఖ్యలను బీజేపీ వారు తమను తాము రక్షించుకోవడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

మేం డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై వారసులమని, తాము ఏ మతానికీ వ్యతిరేకం కాదని అందరికీ తెలుసునని చెప్పారు. తానూ ఆధ్యాత్మికవాదినేనని చెప్పారు. ఒకవేళ ఏదైనా మతం వర్గాల పేరిట ప్రజలను విభజిస్తే, అంటరానితనం, బానిసత్వాన్ని బోధిస్తే అలాంటి మతాన్ని వ్యతిరేకించే వారిలో ముందు ఉంటానని అన్నాదురై చెప్పారని గుర్తు చేశారు. అందరూ సమానత్వంతో జన్మించారని బోధించే అన్ని మతాలను డీఎంకే గౌరవిస్తుందన్నారు.