కొన్ని కుటుంబాల ల‌బ్ధి కోస‌మే జ‌మ్మూక‌శ్మీర్‌ను సంకెళ్ల‌లో వేశారుః ప్ర‌ధాని మోడీ

Congress, allies misled people of J&K in the name of Article 370, says PM

శ్రీన‌గ‌ర్: రోజు శ్రీన‌గ‌ర్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాట్లాడారు. ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన త‌ర్వాత ఆంక్ష‌ల నుంచి స్వేచ్ఛ దొరికింద‌న్నారు. ఎన్నో ద‌శాబ్ధాలుగా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం కాంగ్రెస్‌తో పాటు మిత్ర‌ప‌క్ష పార్టీలు 370 ఆర్టిక‌ల్ పేరుతో జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌జ‌ల్ని, దేశాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించాయ‌ని ఆయ‌న ఆరోపించారు. ఆర్టిక‌ల్ 370 నుంచి జ‌మ్మూక‌శ్మీర్ ల‌బ్ధి పొందిందా, లేదా కొన్ని రాజ‌కీయ కుటుంబాలు మాత్ర‌మే లాభ‌ప‌డ్డాయా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌మ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌న్న విష‌యాన్ని జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌జ‌లు ఆల‌స్యంగా గ్ర‌హించార‌ని మోడీ పేర్కొన్నారు. కొన్ని కుటుంబాల ల‌బ్ధి కోస‌మే జ‌మ్మూక‌శ్మీర్‌ను సంకెళ్ల‌లో వేసేశార‌న్నారు. ఇవాళ జ‌మ్మూక‌శ్మీర్‌లో 370 లేదు అని, దీని వ‌ల్ల ఆ రాష్ట్ర యువ‌త ప్ర‌తిభ‌కు గౌర‌వం ద‌క్కుతోంద‌ని, ఫ‌లితంగా కొత్త అవ‌కాశాలు వ‌స్తున్న‌ట్లు మోడీ చెప్పారు. స‌మాన హ‌క్కులు, స‌మాన అవ‌కాశాలు ల‌భిస్తున్నాయ‌న్నారు.