ఉద్దవ్‌ థాక్రేపై పిర్యాదు చేసిన బిజెపి నేత

మ‌హారాష్ట్రలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఏ క్షణానైనా ఉద్దవ్‌ థాక్రే తన సీఎం పదవికి రాజీనామా చేయొచ్చు. శివ‌సేన‌కు చెందిన కీల‌క నేత ఏక్‌నాథ్ షిండే పార్టీకి చెందిన 40 మందికి పైగా ఎమ్మెల్యేల‌ను త‌న వైపున‌కు తిప్పుకోవ‌డంతో సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే స‌ర్కారు మైనారిటీలో ప‌డిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ఉద్దవ్‌ థాక్రేపై భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శి తజిందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గా పోలీసులకు పిర్యాదు చేసాడు.

ఉద్దవ్‌ థాక్రేకు కరోనా పాజిటివ్‌ సోకిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌ నాథ్‌ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా రాత్రి సీఎం అధికారిక నివాసం ‘వర్ష’ ఖాళీ చేసి వెళ్లారు. ఆ సమయంలో ఆయనపై పూలు చల్లి.. కార్యకర్తలంతా ‘మీ వెంటే ఉంటాం.. ముందుకు వెళ్లండి’ అంటూ నినాదాలు చేస్తూ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. కొవిడ్‌ బారిన పడ్డ వ్యక్తి.. ఐసోలేషన్‌లో ఉండకపోవడం, భౌతిక దూరం తదితర కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ను ఉద్దవ్‌ థాక్రే ఉల్లంఘించారన్నది తజిందర్ పాల్‌సింగ్‌ ఆరోపించారు. ఇక కుటుంబంతో సహా ‘మాతోశ్రీ’కి చేరుకున్న తర్వాత కూడా.. ఆయన వందల మంది మద్దతుదారులతో భేటీ నిర్వహించినట్లు తజిందర్‌ పాల్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.