జగనన్న తోడు నిధులు విడుదల చేసిన సీఎం జగన్

రాష్ట్ర వ్యాప్తంగా చిరువ్యాపారులకు చేయూతనందించడానికి సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన ‘జగనన్న తోడు’ నిధులను విడుదల చేసారు సీఎం జగన్. ఈ ప‌థ‌కం కింద 5,10,412 మందికి ప్రభుత్వం మరో విడత వడ్డీ లేని రూ. 549.70 కోట్ల రుణాలను అందజేయడంతో పాటు గతంలో ఈ పథకం ద్వారా రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన వారికి రూ. 11.03 కోట్ల వడ్డీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది.

అధిక వడ్డీలతో కుదేలైపోతున్న చిరువ్యాపారుల దుస్థితిని చూసిన ముఖ్యమంత్రి జగన్ వారికి చేయూతనందించడానికి 2020 నవంబరు 25వ తేదీన ‘జగనన్న తోడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తోపుడు బండ్లు, రోడ్ల వెంబడి చిన్న దుకాణాల్లో పండ్లు, కూరగాయలు వంటివి అమ్ముకోవడం, టీ, టిఫిన్‌ సహా పలు రకాల వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులకు, సాంప్ర‌దాయ చేతివృత్తుల క‌ళాకారుల‌కు జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం అండ‌గా నిలుస్తోంది. చిరువ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 10,000 రుణం అందజేయడంతో పాటు తీసుకున్న రుణాన్ని ప్రతి నెలా కిస్తీ రూపంలో సకాలంలో చెల్లించే వారికి ఆ రుణంపై అయ్యే వడ్డీ మొత్తం ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. వారికి మరింత రుణ సాయాన్ని కూడా అందిస్తుంది. కొత్త వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ది పొందే వారిలో దాదాపు 85% మహిళలే ఉన్నారు.