కరోనా బారినపడిన మంత్రి గంగుల కమలాకర్‌

తెలంగాణ రాష్ట్ర బీసీ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మరోసారి కరోనా బారినపడ్డారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, అయినా తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా తప్పనిసరిగా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గతంలో హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో కూడా గంగుల కరోనా బారిన పడ్డారు. మళ్లీ ఇప్పుడు ఆయనకు కరోనా సోకింది.

ఇక దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 20,044 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,37,30,071కు చేరాయి. ఇందులో 4,30,63,651 మంది బాధితులు కోలుకోగా, 5,25,660 మంది మృతిచెందారు. మరో 1,40,760 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనాతో 53 మంది మరణించగా, 18,301 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.