ఊమెన్ చాందీ మృతిపై సంతాపం తెలిపిన ప్రధాని మోడీ

pm-modi-paid-tributes-to-former-kerala-cm-congress-leader-oommen-chandy

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన గౌరవప్రదమైన, అంకితభావంగల నాయకుడని నివాళులర్పించారు. ఆయన తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేశారన్నారు. ఆయన మంగళవారం ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు.

మోడీ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, ఊమెన్ చాందీ మరణించడంతో కేరళ అభివృద్ధి కోసం కృషి చేసిన, ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గౌరవప్రదమైన, అంకితభావంగల నాయకుడిని మనం కోల్పోయామని తెలిపారు. కేరళ ముఖ్యమంత్రిగా చాందీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను అనేకసార్లు మాట్లాడుకున్నామని గుర్తు చేసుకున్నారు. ప్రధాన మంత్రిగా ఢిల్లీ వెళ్లిన తర్వాత కూడా తాను ఆయనతో మాట్లాడానని తెలిపారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన మద్దతుదారులకు సంఘీభావం ప్రకటించారు.

కాగా, ఊమెన్ చాందీ గౌరవార్థం మంగళవారం ప్రభుత్వ సెలవు దినంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రొఫెషనల్ కాలేజీలకు మంగళవారం సెలవు ప్రకటించింది. రాష్ట్రంలో రెండు రోజులపాటు సంతాప దినాలుగా పాటించాలని ఆదేశించింది. మంగళవారం జరగవలసిన పరీక్షలను మహాత్మా గాంధీ, కేరళ, కాలికట్ విశ్వవిద్యాలయాలు రద్దు చేశాయి. పీఎస్‌సీ పరీక్ష యథావిథిగా జరుగుతుంది.