అమెరికా గ‌గ‌న‌త‌లంపై వ‌స్తువులు ఏలియ‌న్స్ కాదుః వైట్‌ హౌజ్‌ వివరణ

శకలాలను పరిశీలించాక అవేంటనేది తేల్చేస్తామన్న వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ

No indication of aliens or terrestrial activity with recent takedowns: White House

వాషింగ్టన్ః తమ గగనతలంపై ఇటీవల అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను అమెరికా కూల్చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇవి గ్రహాంతర వాసుల వాహనాలంటూ అమెరికాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని కొట్టిపారేయలేం అని నార్త్ అమెరికన్ ఎయిరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (నోరాడ్) హెడ్ గ్లెన్ డి వాన్ హెరిక్ చెప్పడంతో మరింత గందరగోళం నెలకొంది.

ఈ నేపథ్యంలో తాజాగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరినె జీన్ పీరే స్పష్టతనిచ్చారు. సోమవారం మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మాట్లాడారు. అమెరికా సైన్యం కూల్చేసిన వాహనాలు గ్రహాంతర వాసులవేనంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధమని తేల్చేశారు. ఏలియన్స్ ఉనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఆమె వివరించారు.

ఫిబ్రవరి 4న చైనాకు చెందిన స్పై బెలూన్ ను కూల్చేశాక వారం వ్యవధిలోనే మూడు అనుమానిత వస్తువులను అమెరికా యుద్ధ విమానాలు కూల్చేశాయని పీరే తెలిపారు. సదరు వాహనాల శకలాలను సేకరించే ప్రయత్నంలో ఉన్నామని ఆమె వివరించారు. ఇప్పటి వరకు ఆ మూడింటిలో ఒక్కదానికి సంబంధించిన శకలాలు కూడా సేకరించలేదని చెప్పారు. ఆ శకలాలను పరీక్షించిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆమె తెలిపారు.