నేడు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం

నేడు ప్రగతిభవన్‌లో బిఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు అధినేత కేసీఆర్ అధ్యక్షతన భేటీ జరగబోతుంది. కాగా.. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను కేసీఆర్.. మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించారు. లంచ్ తర్వాతే సమావేశం జరుగనుంది.
ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. జాతీయ పార్టీగా పార్లమెంటులో బీఆర్ఎస్ ఎలా వ్యవహరించాలన్న అంశాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై పోరాడుతూనే.. దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలపై స్పందించేలా దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ర్టానికి సంబంధించి పార్లమెంట్‌లో చర్చింబోయే అంశాలు, బడ్జెట్‌లో కేటాయింపులు, కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు, కేంద్రం నెరవేర్చని విభజన హామీలు తదితర అంశాలపై చర్చించనున్నారు.
ఇదిలా ఉంటె ఈనెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలవనున్నాయి. రెండు విడతల్లో జరుగనున్న ఈ సమావేశాలు ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. మొదటి రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఆ వెంటనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుంచుతారు. రెండో రోజు అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖున కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ సమర్పిస్తారు.