రాష్ట్రంలో భూముల విలువ పెరిగింది: సీఎం కేసీఆర్

ఉద్యోగులు మరింత కష్టపడి పనిచేయాలని పిలుపు

జనగామ: తెలంగాణ రాష్ట్ర పరిస్థితులపై సీఎం కేసీఆర్ స్పందించారు. జోనల్ వ్యవస్థతో అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. దీనిపై అవగాహన లేక కొందరు వ్యతిరేకించారని తెలిపారు. దేశంలో 10 గ్రామాలకు అవార్డులు వస్తే అందులో 7 గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలోనివే అని వెల్లడించారు. ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని, వారికి వేతనాలు ఇంకా పెరుగుతాయని చెప్పారు.తలసరి ఆదాయం త్వరలో రూ.2.70 లక్షలకు పెరగబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వేర్వేరు కాదని అభిప్రాయపడ్డారు.

హైదరాబాదులో ప్రస్తుతం ఒక విల్లా రూ.25 కోట్ల వరకు అమ్ముడవుతోందని, ముంబయి, ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాదులో కొంటున్నారని సీఎం కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో భూముల విలువ పెరిగిందని, ఏడేళ్ల కిందట జనగాంలో ఎకరం రూ.2 లక్షలు ఉంటే, ఇప్పుడది రూ.2 కోట్లకు చేరిందని అన్నారు. సాధారణ ప్రాంతాల్లోనూ భూమి ధర ఎకరం రూ.25 లక్షల వరకు పలుకుతోందని వివరించారు. ప్రత్యేక తెలంగాణ వల్లే ఇదంతా సాధ్యమైందని స్పష్టం చేశారు.

జనగామలో నేడు కలెక్టరేట్ భవన సముదాయ ప్రారంభోత్సంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కొబ్బరికాయ కొట్టించడం విశేషం.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/