పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా

parliament-winter-session-lok-sabha-rajya-sabha-adjourned-sine-die

న్యూఢిల్లీః పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ కంటే ముందే ముగిశాయి. ఇవాళ పార్లమెంట్‌ ఉభయసభలను సభాపతులు నిరవధికంగా వాయిదా వేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో.. షెడ్యూల్‌ కంటే ముందే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను ముగించాలని నిర్ణయించారు.

షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 29 వరకు పార్లమెంట్‌ వింటర్‌ సెషన్‌ కొనసాగాల్సి ఉండగా.. ఈ నెల 23ననే సెషన్‌ను ముగించాలని బీఏసీలో డిసైడ్‌ చేశారు. ఆ మేరకు ఇవాళ లోక్‌సభ, రాజ్యసభ నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఈ నెల 7న ప్రారంభమైన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా చర్చకు పట్టుబట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి.

అయితే, డిసెంబర్‌ 9న అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌ వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగడంతో.. అదే అంశంపై పార్లమెంట్‌ ఉభయసభలు దద్ధరిల్లాయి. ఘటనపై ప్రభుత్వం ఉభయసభల్లో ప్రకటనలు చేసి చేతులు దులుపుకోగా.. ప్రతిపక్షాలు మాత్రం సమగ్ర చర్చ జరగాలని పట్టుబట్టాయి. ప్రభుత్వం చర్చకు అంగీకరించకపోవడంతో నిత్యం రభస కొనసాగింది. చివరికి ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి.

తాజ తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/