గజ్వేల్‌ దేశానికే రోల్‌మోడల్‌గా ఎదిగిందిః సిఎం కెసిఆర్‌

CM KCR Public Meeting In Gajwel

సిద్దిపేట: గజ్వేల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ ప్రసంగించారు. తనను ముఖ్యమంత్రి చేసిన గడ్డ గజ్వేల్ కెసిఆర్ తెలిపారు. గజ్వేల్ తన గౌరవాన్ని పెంచిందని, గజ్వేల్‌కు కూడా రైలు వచ్చిందన్నారు. గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి చూసేందుకు అనేక మంది వస్తున్నారని, దేశానికే రోల్‌మోడల్‌గా ఎదిగిందని ప్రశంసించారు. చేసిన అభివృద్ధి ప్రజల కండ్ల ముందే ఉందన్నారు. సమైక్య పాలనలో సాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడ్డామని, తెలంగాణ ఏర్పడిన తరువాత సాగు నీటి కష్టాలు తీరాయన్నారు. మన పొలాలకు కూడా గోదావరి జలాలు వస్తున్నాయని కెసిఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తనకు బలాన్నిచ్చిన గడ్డ సిద్దిపేట అని కొనియాడారు.

ఈరోజు గజ్వేల్‌లో తాను మాట్లాడుతున్నది 96వ సభ అని అన్నారు. తెలంగాణనే ఆశగా, శ్వాసగా బతుకుతున్నానని, కెసిఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని పోరాటానికి బయలుదేరానని కెసిఆర్ స్పష్టం చేశారు. మన పోరాటంతోనే కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి తెలంగాణ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన సక్కగుంటే ఎన్‌టిఆర్ పార్టీ ఎందుకు పెడుతారని అడిగారు. కాంగ్రెస్ గెలిచేది లేదు సచ్చేది లేదని విమర్శలు గుప్పించారు. రూ.200 ఉన్న పెన్షన్లను రూ. 2 వేలు చేసుకున్నామని, తెలంగాణ సంపద పెరుగుతున్నా కొద్దీ పెన్షన్లు పెంచుకుంటూ పోతామని కెసిఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయించామని, పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి పథకానికి ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు.

తెలంగాణలో బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే ఒక్క విడుదలనే గజ్వేల్ లో దళిత బంధు అమలు చేస్తామని కీలక హామీ ఇచ్చారు. అంతేకాదు.. గజ్వేల్ కు కచ్చితంగా ఐటీ కారిడార్ తీసుకొస్తామని మాట ఇచ్చారు. ఐటి టవర్ కోసం ఇప్పటికే కెటిఆర్ కి చెప్పారని తెలిపారు. కొండపోచమ్మ ఆలయాన్ని మరింత అద్భుతంగా మార్చుకుందామన్నారు. గజ్వేల్ లో నన్ను రెండుసార్లు గెలిపించాలని ముచ్చట మూడోసారి ఆశీర్వదిస్తే కొండపోచమ్మ మల్లన్న సాగర్ అభివృద్ధి చేసుకుందామని హామీ ఇచ్చారు.