తలపాగాతో గురుద్వారాలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం కేసీఆర్

CM KCR performed special pooja in Gurdwara wearing turban

బీహార్ పర్యటన లో భాగంగా సీఎం కేసీఆర్.. గురు గోవింద్ సింగ్ జన్మస్థలమైన గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ గురుద్వారాకు వెళ్లిన సందర్భంగా సిక్కులు ధరించే తలపాగా ధరించారు. ఇలా కేసీఆర్ తలపాగా ధరించడం మొదటిసారి కావడం విశేషం. బీహార్ పర్యటనలో ఉన్న కేసీఆర్… అక్కడి డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. తేజస్వి యాదవ్ తండ్రియైన లాలూ ప్రసాద్ యాదవ్ ను పలకరించిన కేసీఆర్… ఆయన యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. సమకాలీన రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. తర్వాత కేసీఆర్ పాట్నాలోని గురుద్వార్ కు చేరుకున్నారు. అనంతరం సిక్కు నేతలు కేసీఆర్ ను ఘనంగా సన్మానించారు. తర్వాత ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు తిరుగుపయనమయ్యారు.

ఇక గల్వాన్‌ అమరవీరుల కుటుంబాలతోపాటు హైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసేందుకు బీహార్ వెళ్లిన కేసీఆర్..నేరుగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో భేటీ అయ్యారు. అనంతరం బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఈ సందర్బంగా కేసీఆర్..మోడీ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్.. ఎనిమిదేళ్ల మోడీ పాలనలో దేశం పూర్తిగా నష్టపోయిందని, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనమైందని చెప్పారు. రైలుతు, పేదలు, మహిళలు ఏ ఒక్కరికీ మోడీ సర్కారు ఏం చెయ్యలేదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నదుల్లో 70 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, కానీ వాటిని ఉపయోగించుకునే ఆలోచన మాత్రం కేంద్రానికి లేదని విమర్శించారు. దేశరాజధాని ఢిల్లీలో కూడా తాగునీరు, విద్యుత్ సమస్యలు తీర్చలేదని ఎద్దేవా చేశారు.