ఇప్పటివరకు నేను పోరాటం చేశాను.. ఇప్పుడు మీరు చేయాలి : సిఎం కెసిఆర్‌

CM KCR Public Meeting At Achampet

అచ్చంపేట: తెలంగాణ కోసం 24 ఏళ్ల క్రితం ఒంటరిగానే ప్రయాణం ప్రారంభించినట్లు సిఎం కెసిఆర్‌ తెలిపారు. తాను పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్ల దగ్గర ఉన్నారో తెలియదని వ్యాఖ్యానించారు. అచ్చంపేట సభలో కెసిఆర్‌ మాట్లాడుతూ.. ‘‘పాలమూరు జిల్లాలో గతంలో గంజి, అంబలి కేంద్రాలు ఉండేవి. పాలమూరు ప్రజలు బొంబయికి వలస పోయినప్పుడు ఈ నేతలెవరైనా వచ్చారా? నా పోరాటంలో నిజాయతీ ఉంది కాబట్టే విజయం సాధించా. పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ కోసం నా వంతు పోరాటం అయిపోయింది.. ఇక చేయాల్సింది ప్రజలే’’ అని కెసిఆర్‌ అన్నారు. తెలంగాణ కోసం పక్షిలా ఒక్కడినే తిరిగాను అని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చేది లేదని కొందరూ హేళనగా మాట్లాడారు.

కెసిఆర్ నీకు దమ్ముందా..? కోడంగల్ కు రా అని ఒకరు.. గాంధీ బొమ్మ కాడికి రా ఒకరు ఇలా సవాల్ చేస్తున్నారు. ఇది రాజకీయం అనుకోవచ్చా.? రాజకీయం అంటే సవాల్ చేయడం కాదన్నారు. ఎన్నికలు వస్తా ఉంటాయి.. పోతూ ఉంటాయి.. ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. తెలంగాణ రాక ముందు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఎలక్షన్లు రాగానే ఆగం ఆగం కావద్దు.. ఏది చెప్పిన వినకండి.. నా వంతు పని నేను చేశాను… ఇప్పుడు మీరు చేయాలి అన్నారు.

రైతు బంధు గురించి, రైతుల గురించి ప్రస్తావించారు. కెసిఆర్ దమ్ము ఏంటో ఇండియా మొత్తం చూసింది. మీ కళ్లకు కనిపిస్తుంది కెసిఆర్ దమ్ము కాదా..? నవంబర్ 30న మీరంతా దుమ్ము లేపండి. రైతుబంధు కోసం ఎవరైనా ఆలోచించారా..? ఈ ప్రపంచంలో రైతు బంధును పుట్టించిందే కెసిఆర్ అని వెల్లడించారు. ఓట్ల కోసం తప్పుడు హామీలను ఇవ్వను. అచ్చంపేట నియోజకవర్గంలో 2లక్షల ఎకరాలకు నీళ్లు తెప్పించే బాధ్యత నాదే అన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తానంటే జానారెడ్డి గజమెత్తు ఎగిరిండు.. ఆ తరువాత బిఆర్ఎస్ తరుపున ప్రచారం చేస్తానన్నారు. అప్పర్ ప్లాట్ లో కూడా నీళ్లు తెప్పిస్తాను. పాలమూరు ఎత్తిపోతల పథకం 190 కేసులను కాంగ్రెస్ పార్టీనే వేసింది. తెలంగాణ కావాలని అడిగితే కాల్చి చంపింది కాంగ్రెస్ కాదా అన్నారు. రైతు భూమి మీద రైతుకే అధికారం ఉండాలని ధరణీని తీసుకొచ్చానని తెలిపారు.