నేడు పాలేరు, మానుకోట‌, వర్ధన్నపేటలో సిఎం కెసిఆర్‌ ప్రజా ఆశీర్వాద సభలు

CM KCR public blessing meetings in Paleru, Manukota, Wardhannapet today

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయం క్రమంగా వేడెక్కుతున్నది. పార్టీలన్నీ తమతమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ తన సుడిగాలి పర్యటనలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రతిరోజూ మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. సామెతలు, ఛలోక్తులతో గత పదేండ్లలో తాము చేసిన అభివృద్ధిని తనదైన శైలిలో వివరిస్తూ ప్రజలను ఆకట్టుకోవడంతోపాటు ఆలోచింపచేస్తున్నారు.

ఈనేపథ్యంలోనే శుక్రవారం మరో మూడు నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో బిఆర్‌ఎస్‌ అధినేత పాల్గొననున్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మహబూబాబాద్‌, వర్ధన్నపేట నియోజవర్గాల్లో ప్రజా ఆశ్వీర్వాద సభలకు హాజరుకానున్నారు. తొలుత పాలేరు అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 1.40 గంటలకు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెర్వు హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 1.50 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ అనంతరం మహబూబాబాద్‌ సభకు బయలుదేరుతారు.

మధ్యాహ్నం 3.10 గంటలకు మహబూబాబాద్‌‎కు చేరుకొని ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్‌ను గెలిపించాలని కోరుతారు. సభ ముగిసిన అనంతరం సాయంత్రం 4.20 గంటలకు వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభకు చేరుకుంటారు.