బీజేపీలో చేరబోతున్న సుదీప్‌కు బెదిరింపు లేఖ..

బీజేపీలో చేరబోతున్న సినీ నటుడు సుదీప్‌కు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు లేఖ రాసారు. బిజెపి లో చేరవద్దని, ఒకవేళ చేరితే సుదీప్ ప్రైవేట్ వీడియో తమ వద్ద ఉందని, బీజేపీలో గనక చేరితే దాన్ని లీక్ చేస్తామంటూ బెదిరించారు. ఈ లేఖ అందిన వెంటనే మేనేజర్ జాక్ మంజు- బెంగళూరు పుట్టనహళ్లి పోలీస్ స్టేషన్‌ల్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీలోని 504, 506, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

మే 10 న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రధాన పార్టీలన్నీ సిద్ధమయ్యాయి. మొత్తం 224 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ తరుణంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసాయి. బీజేపీ తరఫున ప్రధాని మోడీ రంగంలోకి దిగారు. అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తోన్నారు. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గేకు ఇది సొంత రాష్ట్రం. ఫలితంగా ఈ ఎన్నికలను అటు కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మంగా తీసుకుంది. ఇప్పటివరకు వెలువడిన ఒపీనియన్ పోల్స్ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. ఇదే క్రమంలో బిజెపి సినీ నటుల ఫై ఫోకస్ చేసింది. అందులో భాగంగా సుదీప్ ను పార్టీ లోకి ఆహ్వానించింది. ఈరోజు మధ్యాహ్నం ఆయన బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారు.