నేడు జడ్చర్ల, మేడ్చల్‌ లలో ప్రజా ఆశీర్వాద సభలు

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత మూడు రోజులుగా జిల్లాల వ్యాప్తంగా ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. నిన్న సిద్దిపేట , సిరిసిల్ల జిల్లాలో సభల్లో పాలగోన్న కేసీఆర్ ..నేడు జడ్చర్ల, మేడ్చల్‌ , మహబూబ్‌నగర్‌ సభల్లో పాల్గొననున్నారు. తొలుత జడ్చర్ల తర్వాత మేడ్చల్‌లో నిర్వహించే బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలపై ప్రజల్లో అమితాసక్తి, ఆమోదం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బుధవారం నిర్వహించే సభల విజయవంతానికి జడ్చర్ల ఎమ్మెల్యే సీ లక్ష్మారెడ్డి, మేడ్చల్‌లో మంత్రి చామకూర మల్లారెడ్డి విస్తృత ఏర్పాట్లు చేశారు.

నిన్న సిరిసిల్లలో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పునరుద్ఘాటించారు. వ్యవసాయానికి రోజుకు 3 గంటల కరెంటు చాలు అని కాంగ్రెస్‌ అంటున్నదని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ‘సాగుకు 3 గంటల కరెంట్‌ చాలనేది కాంగ్రెస్‌ నినాదం.. 24 గంటల నాణ్యమైన విద్యుత్తు కావాలనేది మా విధానం. ఇందులో ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని సూచించారు. తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దుచేస్తామని కాంగ్రెస్‌ అంటున్నదని, అదే జరిగితే రైతులు మళ్లీ గోసపడటం తప్పదని హెచ్చరించారు. మోడీ సొంత రాష్ట్రంలోనూ 24 గంటల కరెంట్‌ ఇవ్వడం లేదు. దేశంలో ఒక్క తెలంగాణలో మాత్రమే 24 గంటల కరెంట్‌ వస్తున్నది. ఇది ఆశామాషీగా ఏం సాధ్యం కాలేదు. కేసీఆర్‌ మొండి పట్టుదలతోనే సాకారమైంది. దేశంలో అనేక రంగాల్లో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఎదిగిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. తొమ్మిదిన్నరేండ్లలోనే కనీవినీ ఎరగని అభివృద్ధి సాధించిందని చెప్పారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగంలో నంబర్‌ వన్‌ స్థాయికి చేరిందని, ఇంటింటికీ నల్లానీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. కడుపు, నోరు కట్టుకొని నిజాయితీగా పనిచేసి సాగునీళ్లు, తాగునీళ్లు, కరెంట్‌.. ఇలా అన్నీ సాధించామని అన్నారు.

సిద్దిపేటతో తనకున్న అనుబంధాన్ని, గత అనుభవాలను స్మరించుకొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలకు సిద్దిపేటలో ఎదురైన అనుభవాలే ప్రేరణ అని వివరించారు. హరీశ్‌రావును మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి గత రికార్డులను తిరగరాయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘నియోజకవర్గంలో ప్రజలెవరైనా ఉన్నారా.. అంతా ఇక్కడే ఉన్నారా? అన్నంతగా వచ్చిన అశేష జనవాహినిని, లెక్కించడానికి వీలుకానంత సంఖ్యలో వచ్చిన ప్రజలను చూసి సంతోషిస్తున్నా’ అని కేసీఆర్‌ అన్నారు.