తెలంగాణలోకి మతోన్మాదశక్తులు అడుగుపెట్టాయి..జాగ్రత్తగా ఉండాలి – సీఎం కేసీఆర్

cm kcr fire on bjp at public gardens

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..తెలంగాణ లో మతోన్మాదశక్తులు అడుగుపెట్టాయి..జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజలకు సూచించారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ జీవన ముఖచిత్రం ఎంతగానో మారిపోయోయిందని , పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో శాంతికి నెలవుగా తెలంగాణ అలరారుతున్నది. సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ రాష్ట్రం ప్రగతిబాటలో పయనిస్తున్నది. ఈ తరుణంలో మతతత్వ శక్తులు బయలుదేరి తమ వికృత ప్రయత్నాలతో తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.

ఏ కొంచెం ఆదమరిచినా ఎంతటి బాధాకరమైన, దౌర్భాగ్యమైన పరిస్థితులు సంభవిస్తాయో తెలుసుకోవడానికి మన తెలంగాణే మనకు ఉదాహరణ. ఒకనాడు జరిగిన ఏమరుపాటు వల్ల తెలంగాణ 58 సంవత్సరాలు శాపగ్రస్త జీవితం అనుభవించింది. తాను కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది. ఎంతోమంది జైలుపాలు కావలసి వచ్చింది, ఎన్నోజీవితాలు ఆహుతై పోవాల్సి వచ్చింది. ఆ చరిత్రంతా నేను వేరే చెప్పనక్కరలేదు. అది మనందరి ప్రత్యక్ష అనుభవం. సమీప చరిత్రలోనే జరిగిన తెలంగాణ ఉద్యమంలో మనమందరం ప్రత్యక్ష భాగస్వాములమే. హక్కుల కోసం, అస్తిత్వం కోసం తెలంగాణ సమాజం అనుభవించిన ఘర్షణను తలచుకుంటే నేటికీ నా కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి. అటువంటి కష్టం, అటువంటి వేదన పొరపాటున కూడా మళ్లీ రాకూడదు. అందుకు నిశిత పరిశీలన, నిరంతర చైతన్యం కావాలని కేసీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు.

జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయి. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధంలేని ఈ అవకాశవాదులు, ఆషాడ భూతులు చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని కేసీఆర్ మండిప‌డ్డారు.