నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడం పట్ల యావత్ దేశ ప్రజలు గర్వంగా ఫీల్ అవుతున్నారు. సినీ అభిమానులు, ప్రముఖులే కాదు అన్ని రంగాల వారు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ , ప్రధాని మోడీ లు సైతం అభినందనలు తెలిపారు.

విశ్వ సినీ యవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమన్నారు. నాటు నాటు పాటలో పొందుపరిచిన పదాలు.. తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని తెలిపారు. తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, నాటు పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన పాట తెలంగాణ‌ రచయిత, చంద్రబోస్ ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి , కూర్పులో భాగస్వాములైన దర్శకుడు రాజమౌళి , గాయకులు రాహుల్ సిప్లిగంజ్ , కాలభైరవ , నటులు రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ , కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సినిమా నిర్మాత డివివి దానయ్య, ఇతర సాంకేతిక సిబ్బందికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే ప్రధాని మోడీ సైతం ఆర్ఆర్ఆర్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా కీరవాణి, చంద్రబోస్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. నాటు నాటు పాట అమోఘమన్న మోడీ.. ఇది దేశం గర్వించిన రోజని కొనియాడారు. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఆస్కార్ అందుకున్న ది ఎలిఫెంట్ విస్పరస్ బృందానికి కూడా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి కేటీఆర్ సైతం.. ఆర్ఆర్ఆర్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నాటునాటు పాటకు ఆస్కార్ రావటం పట్ల కోట్ల మంది భారతీయులు సెలెబ్రేట్ చేసుకుంటున్నారని తెలిపారు. రాజమౌళి దేశాన్ని గర్వపడేలా చేశారన్నారు. చరిత్ర సృష్టించిన.. ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్, రాంచరణ్‌కు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. ది ఎలిఫెంట్ విస్పరస్ టీమ్‌కు కూడా కేటీఆర్ అభినందనలు తెలిపారు కేటీఆర్.

భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ సందర్భమని టీఎస్ ఆర్జీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ దక్కడం ఎంతో గర్వకారణమని కొనియాడారు. ఆర్ఆర్ఆర్ చిత్ర దర్శకుడు రాజమౌళికి, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు ఇతర చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై ఆస్కార్ పురస్కారాన్ని స్వీకరించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ లకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ వార్తను చూడగానే ఎంతో సంతోషించాను. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నిలిచిన RRR చిత్రంలో ‘నాటు నాటు’ గీతంకు ఆస్కార్ లో స్థానం దక్కడం పట్ల తెలుగు చలనచిత్ర రంగం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిందన్నారు. ఆ హుషారు ఈ రోజు ఆస్కార్ వేదిక మీద రెట్టించిన ఉత్సాహంతో కనిపించింది. ఈ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడంతో పాటు అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరిందని, ఇంతటి ఘనత పొందేలా ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రాన్ని రూపొందించిన దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి కి ప్రత్యేక అభినందనలు తెలిపారు.