శరత్ బాబు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యం తో సోమవారం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఏ ఐ జి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈయన మృతి పట్ల యావత్ చిత్రసీమ తో పాటు రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

శరత్ బాబు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. శరత్ బాబు మృతికి సంతాపం తెలియజేశారు. శరత్ బాబు 5 దశాబ్దాలుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 220కి పైగా చిత్రాల్లో నటించారని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. ఈ సమయంలో, శరత్ బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు.

అలాగే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా శరత్ బాబు మృతిపై స్పందించారు. శరత్ బాబు మరణం బాధాకరమని పేర్కొన్నారు. ఏ పాత్ర అయినా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన విలక్షణ నటుడు శరత్ బాబు అని అభివర్ణించారు. 1974లో రామరాజ్యం సినిమాలో హీరోగా పరిచయమై వచ్చిన శరత్ బాబు ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా అనే సినిమాల్లో నటించారు. ఆయన నటించిన సినిమాలు అనేకం విజయవంతమయ్యాయి. సాగర సంగమం, స్వాతిముత్యం, గుప్పెడు మనసు, అభినందన, నోము, యమ కింకరుడు, అమరజీవి ఇలా అనేక సినిమాల్లో నటించారు. ఆయన చివరిసారిగా వకీల్ సాబ్ సినిమాలో నటించారు. మొత్తం 220 పైగా సినిమాలలో నటించారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితంలో మొదట రమాప్రభను పెళ్లి చేసుకున్నారు. ఆపై 1988లో ఆమెతో విడిపోయారు. మళ్ళీ శరత్ బాబు 1990 లో స్నేహా నంబియార్ ను పెళ్లి చేసుకున్నారు. ఆపై ఆమెకు 2011లో విడాకులు ఇచ్చారు.