నా కుమారుడు పోటీ చేసే విషయం జగన్ నిర్ణయిస్తారుః పేర్ని నాని

బతికున్నంత కాలం జగన్ తోనే ఉంటామని వ్యాఖ్యలు

perni-nani

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని తన వారసుడ్ని తెరపైకి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు సీఎం జగన్ సభలో పేర్ని నాని రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. సభ ముగిసిన అనంతరం పేర్ని నాని తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చారు. ఇక ముందు ఎన్నికల్లో పోటీ చేయనని కొంతకాలంగా చెబుతూనే ఉన్నానని అన్నారు. జగన్ తనను ఓ పాత స్నేహితుడిగా, అనుచరుడిగా వేదికపై పక్కన కూర్చోబెట్టుకోవచ్చేమో కానీ… వేదికలపై ఇకమీదట మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. “పేర్ని నాని ఇకపై పోటీ చేయడు… జగన్ ను వదలడు, బతికున్నంత కాలం నేను, నా కుటుంబ సభ్యులు జగన్ వెన్నంటే ఉంటాం” అని పేర్ని నాని స్పష్టం చేశారు. జగన్ ఎప్పుడు ఏ పని చెబితే ఆ పనిచేయడానికి తాను సదా సిద్ధంగా ఉంటానని వెల్లడించారు.

ఇక తన వారసుడు పేర్ని కిట్టు గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, పేర్ని నాని ఆసక్తికరంగా జవాబిచ్చారు. “వచ్చే ఎన్నికల్లో పేర్ని కిట్టు వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థిగా నిలబడుతున్నాడు అని చెప్పడానికి నేనెవడ్ని? అంతా జగన్ మోహన్ రెడ్డి ఇష్టం. పార్టీ అధ్యక్షుడు ఆయన. ఇందులో నా ఇష్టం ఏముంటుంది… అంతా జగన్ ఇష్టం. జగన్ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని మా అబ్బాయి అంటున్నాడు. ఒకవేళ జగన్ టికెట్ ఇవ్వకపోయినా నేను, మా అబ్బాయి, మా ఆవిడ పార్టీ జెండా మోయడం ఆగేదే లేదు. జగన్ రాజకీయాల్లో ఉన్నంతకాలం, మేం బతికున్నంతకాలం జగన్ వెంటే ఉంటాం” అంటూ పేర్ని నాని తన మనోభావాలను పంచుకున్నారు.