ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ : రూ.10,461 కోట్ల నిధులు మంజూరు

ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. 2014-15 రెవెన్యూ లోటు కింద ఒకేసారి రూ.10,461 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నెల 19న కేంద్ర ఆర్థిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి విడతల వారీగా నిధులను విడుదల చేస్తూ వచ్చిన కేంద్రం తొలిసారిగా ఇన్ని నిధులను ఏకమొత్తంలో విడుదల చేసింది.

2014లో తొలి విడతగా రూ.2303 కోట్లు విడుదల చేసింది. ఆ తరువాత 2015లో మరో రూ. 500 కోట్లు, 2016లో రూ.1176.50 కోట్లు వెరసి మొత్తం రూ.3979.50 కోట్లు ఇచ్చింది. మిగతా మొత్తాన్ని తర్వాత విడుదల చేస్తామని చెప్పిన కేంద్రం, ఇంకా రూ.139.39 కోట్లు మాత్రమే ఇవ్వాలని ఆ తరువాత వెల్లడించింది. మిగిలిన మొత్తాన్ని కొత్త పథకాల కోసం ఖర్చు చేశామని 2017 లో అప్పటి ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఇక ఇప్పుడు 2014 -2015 కింద రెవెన్యు లోటు కింద కేంద్రం 10 ,460 కోట్లు ఇచ్చింది.