బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన కీలక నేత..

రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీ బిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. కేసీఆర్ , కేటీఆర్ లకు అత్యంత సన్నిహితుడు , ఉద్యమకాలంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పశ్చిమ ప్రాంతానికి సారథ్యం వహించిన కూచాడి శ్రీహరిరావు బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసారు. త్వరలోనే ఈయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది.

ఉద్యమకాలంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పశ్చిమ ప్రాంతానికి సారథ్యం వహించిన శ్రీహరి రావు.. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసి గట్టిపోటీ ఇచ్చారు. అయితే.. 2018 ఎన్నికల టైమ్‌లో అధిష్టానం, కేటీఆర్‌ సూచనతో పోటీచేయకుండా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మద్దతుగా నిలిచి గెలిపించారు. ఇన్నిరోజులుగా అంతా బాగానే ఉన్నా ఈ మధ్యే ఇంద్రకరణ్ రెడ్డితో శ్రీహరిరావుకు అస్సలు పడట్లేదు. కొన్ని అంతర్గత కారణాల దృష్ట్యా అటు మంత్రితో.. ఇటు పార్టీకి దూరమవుతూ వచ్చారు. ఇక ఇప్పుడు ఏకంగా పార్టీకే రాజీనామా చేసారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందుండి పోరాటం చేసినప్పటికీ.. తమకు రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎలాంటి గుర్తింపు లేకపోవడాన్ని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటె కాంగ్రెస్‌లో చేరాలని శ్రీహరికి.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గత నెలలోనే ఆహ్వానం పంపారు. శ్రీహరి కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరతారో.. చేరాక ఈయనకు పార్టీలో ఏ మాత్రం ప్రాధాన్యత ఉంటుందో చూడాలి.