మహబూబాబాద్ జిల్లాలో మరో మండలానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో 13 మండలాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీచేసింది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో మరో మండలానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇనుగుర్తి మండల ఏర్పాటుకు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో కొత్త మండలాల జాబితాలో మరో మండలం చేరినట్లయింది. దీంతో కొత్తవి 14 మండలాలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 594 మండలాలుండగా.. కొత్తవాటితో కలుపుకొని 608 అయ్యాయి. ఇనుగుర్తిని మండలం చేయడం తో ఇనుగుర్తి ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాలనాసంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తోంది. ఇనుగుర్తి ఏర్పాటుతో మహబూబాబాద్ జిల్లాలో రెండు మండలాలను ఏర్పాటు చేసినట్లైంది. అంతకు ముందు సిరోల్ ను మండలం చేసారు.

రెండురోజుల క్రితం ఏర్పాటు చేసిన 13 మండలాల జాబితా ఇలా ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఆలూర్, డొంకేశ్వర్ సాలూర , మహబూబాబాద్ జిల్లాలో సీరోల్ , నారాయణ పేట జిల్లాలో గుండుమల్, కొత్తపల్లె వికారాబాద్ జిల్లాలో దుడ్యాల్, మహబూబ్ నగర్ జిల్లాలో కౌకుంట్ల. నల్లగొండ జిల్లాలో గట్టుప్పల్. సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట్. కామారెడ్డి జిల్లాలోని డోంగ్లి. జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం. ఇప్పుడు మరోటి ఇనుగుర్తి. ప్రస్తుతం కేసముద్రం మండలంలో ఉన్న ఇనుగుర్తి..ఇప్పుడు కొత్త మండలంగా మారబోతోంది. మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం 16 మండలాలున్నాయి.