రేపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు (జులై 26 ) అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. అలాగే ఎగువ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఏపీలోని లంక గ్రామాలూ ముంపుకు గురయ్యాయి. ఈ క్రమంలో రేపు ముంపు బాధితులతో జగన్ నేరుగా మాట్లాడబోతున్నారు.

రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 10.30 గంటలకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చేరుకుంటాకరు. అక్కడి నుంచి 11 గంటలకు పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు. ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు.

అనంతరం జగన్ అక్కడి నుంచి ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుని అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం వెళతారు. అక్కడ వరద బాధితులతో సమావేశం అనంతరం సాయంత్రం 4.05 గంటలకు తిరిగి రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరద ప్రభావం అనంతరం తీసుకున్న సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి అక్కడే బస చేసి, ఎల్లుండి ఉదయం పరిస్దితిని సమీక్షించిన తర్వాత తాడేపల్లికి తిరిగిరానున్నారు. ఇటీవల ఈ ముంపు గ్రామాల్లో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించిన సంగతి తెలిసిందే. ముంపు గ్రామాల్లో ప్రజలకు కనీస మౌలిక వసతులు కూడా అందించలేదని ప్రతిపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో రేపు సీఎం జగన్ పర్యటించడం కొంత ఆసక్తికరంగా మారింది.