హర్‌ ఘర్‌ తిరంగాలో అపశ్రుతి..మాజీ డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌ గాయాలు

75 ఏళ్ల భారత దేశ స్వాతంత్ర ఉత్సవాల్లో భాగంగా.. కేంద్ర సర్కార్ బిజెపి హర్‌ ఘర్‌ తిరంగాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా జాతీయ జెండా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. అలాగే హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలను సైతం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి.

ఈ తరుణంలో గుజరాత్‌ లో అపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం మెహ్‌సనా జిల్లా కడి ప్రాంతంలో గుజరాత్‌ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. వీధుల్లో తిరిగే ఆ ఆవు నినాదాలకు భయపడి.. ర్యాలీ వైపు దూసుకొచ్చింది. నితిన్‌ పటేల్‌ ను గట్టిగా ఢీ కొట్టడం తో ఆయన కిందపడ్డారు. దీంతో కాలికి గాయం కాగా.. సిబ్బంది అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత ఎస్కార్ట్‌ సాయంతో అహ్మదాబాద్‌ ఆస్పత్రికి ఆయన్ని తరలించారు. ఆయన కాలికి చిన్న ఫ్రాక్చర్‌ అయ్యిందని, నెలరోజుల రెస్ట్‌ అవసరమని డాక్టర్స్ సూచించారు.

“2,000 మంది పాల్గొన్న కాడి దగ్గర తిరంగ యాత్ర నిర్వహించారు. ర్యాలీ కూరగాయల మార్కెట్‌కి చేరుకునే సమయంలో ఒక ఆవు అకస్మాత్తుగా పరుగెత్తుకుంటూ వచ్చింది” అని పటేల్ చెప్పారు. ఈ గొడవలో ఆయనతోపాటు మరి కొంతమందికి కూడా గాయాలయ్యాయని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఆ వీడియోలో జనం జెండాను పట్టుకుని.. ఊరేగింపుగా కదులుతుండగా ఆవు దూసుకెళ్లడాన్ని చూడొచ్చు. ఆ ఆవు పటేల్‌‌ను వెనక్కి నెట్టడం, ఆయన నేలపై పడిపోవడం కూడా చూడొచ్చు.