నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

AP: సీఎం జగన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాను ఆవిష్కరిస్తారు. వ్యూ పాయింట్ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ను పరిశీలించిన అనంతరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది.

ప్రకాశం, NLR, YSR జిల్లాలకు శ్రీశైలం నీటిని తరలించేలా రూ.10వేల కోట్లతో రూపొందించిన ఈ టన్నెళ్ల ద్వారా 53.85 TMCల కెపాసిటీతో నిర్మించిన నల్లమల్ల సాగర్కు నీరు తరలిస్తారు. డెడ్ స్టోరేజ్ 10.35 TMCలు, ఆవిరి నష్టాలు 3.36 TMCలుగా అంచనా వేయగా.. 3 జిల్లాల్లోని సాగునీటికి 38.57 TMCలు, 15.25 లక్షల మంది తాగునీటికి 1.57 TMCలు కేటాయిస్తారు. 2004లో అప్పటి సీఎం వైఎస్సార్ ఈ జలయజ్ఞానికి తిరిగి శ్రీకారం చుట్టారు. నల్లమలసాగర్తో పాటు సొరంగం పనులను ప్రారంభించారు. 2019లో వైఎస్ తనయుడు జగన్ ప్రభుత్వం అయ్యాక ఈ టన్నెల్ పనులను రికార్డు సమయంలో పూర్తి చేసింది.