నేడు అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన

సీఎం జగన్ నేడు అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు సీఎం జ‌గ‌న్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయం నుంచి బయలుదేరి బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం చేరుకుంటారు. అక్కడి నుంచి కత్తిమంద గ్రామంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ఇక నిన్న మంగళవారం పోలవరంకు వెళ్లి అక్కడి పనులను పరీక్షించి , అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదట తాడేపల్లి నుంచి పోలవరంకు వెళ్లిన సీఎం ఏరియాల వ్యూ ద్వారా పనులను పరిశీలించారు. కోతకు గురైన డయాఫ్రమ్ వాల్ ఈసీఆర్ఎఫ్ డ్యాం పనుల పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. అయితే ఆ డయాఫ్రమ్ వాల్ పూర్తయితే మెయిన్ డ్యామ్ పనులు త్వరగా పూర్తి చేసే అవకాశం ఉందని..కాబట్టి ముందుగా కోతకు గురైన దీనిని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. డిసెంబర్ వరకు ఈ పనులు పూర్తి చేయాలని అధికారులను హెచ్చరించారు.

‘‘గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో ఖాళీలు వదిలేశారు. ఈ ఖాళీల గుండా వరద నీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లింది’’ అని తెలిపారు. ‘‘ఈఎస్‌ఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణానికి కీలకమైన డయాఫ్రం వాల్‌ దారుణంగా దెబ్బతింది. దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడమే కాకుండా రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇది మాత్రం ఎల్లో మీడియాకు కనిపించలేదు. ఎందుకంటే రామోజీరావు బంధువులకే పనులు అప్పగించారు’’ అని విమర్శించారు.