కాసేపట్లో వైసీపీ నేతలతో CM జగన్ కీలక సమావేశం..

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో వైసీపీ అధినేత , సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ నేతల కీలక సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు దాదాపు 2,700 మంది ఈ సమావేశానికి హాజరుకానున్నారు. వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం, టీడీపీ – జనసేన ఉమ్మడి జాబితా ఫై చర్చలు జారడం , టీడీపీ నేతలను ఎలా ఎదురుకోవాలి తదితర విషయాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

వై నాట్‌ 175 లక్ష్యంగా నేతలకు విస్తృత స్థాయి స‌మావేశంలో పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల‌పై దిశానిర్దేశం చేస్తార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎలా పని చేయాలనేది , గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో వైసీపీ ఎప్పుడూ ప్రజల్లోనే ఉందన్నారు. ఐదేళ్లుగా జరిగిన సంక్షేమ పాలనను ప్రజలకు వివరిస్తున్నామని , క్యాడర్‌కు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేస్తారన్నారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేలా సీఎం సూచనలు చేస్తారని తెలిపారు.