నేడు ఏపీకి రాజ్ నాథ్ సింగ్.. బీజేపీ నేతలతో భేటీ

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈరోజు ఏపీలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల సమరం మొదలుకాబోతుండడం తో..ఈ సమరానికి బీజేపీ కూడా సిద్ధం అవుతుంది. ఈ తరుణంలో ఈరోజు ఏలూరులో16 వేల మంది పోలింగ్‌ బూత్‌ స్థాయి ఏజెంట్లతో బిజెపి భారీ సమావేశం నిర్వహిస్తోంది. 25 లోక్‌సభ స్థానాలు ఉన్న రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా విభజించి మొదటి సమావేశాన్ని ఏలూరులో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టింది. దేశంలోనే ఇది మొదటి క్లస్టర్‌ భేటీ కూడా కావడం గమనార్హం.

దీనిని ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో తలపండిన మాజీ జాతీయ అధ్యక్షుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రారంభించనుండడం మరో విశేషం. ఈ భేటీకి కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, ఏలూరు, నరసాపురం లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ప్రతి పోలింగ్‌ బూత్‌ నుంచి ఇద్దరు క్రియాశీల కార్యకర్తలను ఆహ్వానించారు. ఇక్కడి నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికలకు ఎలా వెళ్లాలనే దానిపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాజ్నాథ్ విశాఖ పట్నం, విజయవాడలోనూ పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఉచిత రేషన్‌, రైతు భరోసా (రూ.6 వేలు), ఉజ్వల గ్యాస్‌, ఆయుష్మాన్‌ భారత్‌, పక్కా గృహాలు, ఉపాధి పనులు మొదలైన పథకాలు అమలు చేస్తున్నది మోదీ ప్రభుత్వమేనన్న సంగతి ఓటర్లకు వివరించాలని చెప్పనున్నారు.