రత్నం పెన్నుల అధినేత కేవీ రమణమూర్తి మృతి

రత్నం పెన్నుల అధినేత కేవీ రమణమూర్తి మృతిచెందారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన రాజమహేంద్రవరంలోని స్వగృహంలో సోమవారం మృతిచెంచారు. వారసత్వంగా వచ్చిన పెన్నుల తయారీ వృత్తినే ఆయన ఉపాధిగా మలచుకుని జీవనోపాధి పొందారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా మహాత్మాగాంధీ పిలుపు మేరకు 1932లో రమణమూర్తి తండ్రి కోసూరి వెంకటరత్నం రాజమహేంద్రవరంలో రత్నం పెన్నుల తయారీ సంస్థను ప్రారంభించారు.

1935 జులై 18న రత్నం పెన్నును అభినందిస్తూ మహాత్మా గాంధీ ఆయనకు లేఖ రాశారు. వెంకటరత్నం 1981లో మృతి చెందాక ఆయన తనయుడు కేవీ రమణమూర్తి సంస్థను కొనసాగిస్తున్నారు. తండ్రి మరణం తర్వాత రత్నం సన్స్‌ పెన్‌ వర్కు పేరుతో రాజమహేంద్రవరంలోని రంగ్రీజుపేటలో సంస్థను కొనసాగిస్తున్నారు. విదేశాలకు సైతం పెన్నులు ఎగుమతి చేస్తున్నారు. రమణమూర్తికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. రమణమూర్తి మృతి పట్ల పలువురు రాజకీయనేతలు సంతాపం వ్యక్తం చేశారు.