నేడు జగనన్న చేదోడు నిధులు విడుదల చేయనున్న సిఎం జగన్‌

cm-jagan

అమరావతిః జగనన్న చేదోడు నిధులను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సిఎం జగన్ నేడు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కుల వృత్తుల్లో ఉన్న రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ల జీవితాల్లో మార్పు కోసం వరుసగా నాలుగో ఏడాది.. ‘జగనన్న చేదోడు” నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ వృత్తిలో ఉన్న వారికి రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సిఎం జగన్‌ జమ చేయనున్నారు.

సొంత షాపులు ఉన్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా రూ. 10,000 చొప్పున సాయం అందిస్తారు. నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.40,000 ఆర్థిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందించింది. తాజాగా గురువారం అందిస్తున్న సాయంతో కలిపి ఈ 4 ఏళ్ళలో కేవలం జగనన్న చేదోడు పథకం ద్వారా ప్రభుత్వం లబ్దిదారులకు రూ. 1,252.52 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించింది. జగనన్న చేదోడు పథకంలో 1,80,656 మంది టైలర్లకు నాలుగో విడతలోరూ. 180.66 కోట్ల లబ్ధిని చెల్లిస్తారు. 39,813 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 39.81 కోట్లను చెల్లిస్తారు. 1,04,551 మంది రజకులకు నాలుగో విడత సాయంగా రూ. 104.55 కోట్ల లబ్ధి చేకూరుస్తారు.