ఓ కాంట్రాక్ట‌ర్ అహంకారానికి, మునుగోడు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వానికి మ‌ధ్య జ‌రుగుతున్న ఎన్నిక ఇది – కేటీఆర్

మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ఈరోజు గురువారం మునుగోడు నియోజకవర్గం లో పర్యటించారు. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేషన్ దాఖ‌లు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొని బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఓ కాంట్రాక్ట‌ర్ అహంకారానికి, మునుగోడు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వానికి మ‌ధ్య జ‌రుగుతున్న ఎన్నిక ఇది అని కేటీఆర్ అన్నారు.

నాలుగేండ్ల పాటు మునుగోడును పట్టించుకోని రాజగోపాల్…ఈరోజు ఒక్కో ఓటుకు వేల రూపాయాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ నాలుగేండ్ల‌లో ఒక్క మంచి ప‌ని చేయ‌లేదు. అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించ‌లేదు. చేసిందేమీ లేదు. అసెంబ్లీలో మైక్ దొరికితే.. కాంట్రాక్ట‌ర్‌ల‌కు బిల్లుల వ‌స్త‌లేవు అని అంట‌డు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ మాకు మోడీ ఇచ్చిండ‌ని ఆయ‌నే చెబుతాడు. మళ్లీ మాది చిన్న కంపెనీ అని అంట‌డు. మ‌రి చిన్న కంపెనీకి పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చిన వారెవ‌రు? దాని వెనుక ఉన్న‌ది ఎవ‌రు? అని కేటీఆర్ ప్రశ్నించారు. మిష‌న్ భ‌గీర‌థ‌కు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలంటే మోడీ ఇవ్వ‌రు. కానీ రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టుల‌ను అప్ప‌నంగా రాజ‌గోపాల్ రెడ్డికి క‌ట్ట‌బెట్టారు అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

మునుగోడు లో టిఆర్ఎస్ ను గెలిపించాలని ప్రజలను కేటీఆర్ కోరారు. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌ని ప్రకటించారు. న‌వంబ‌ర్ 6 త‌ర్వాత ప్ర‌తి మూడు నెల‌ల‌కొక‌సారి వ‌చ్చి అభివృద్ధి ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తానని , అభివృద్ధిలో అండ‌గా ఉంటానని , రోడ్ల‌ను అభివృద్ధి చేస్తానని హామీఇచ్చారు. నా మాట మీద విశ్వాసం ఉంచండి. త‌ప్ప‌కుండా అభివృద్ధిలో ప‌య‌నిద్దాం. మునుగోడును అభివృద్ధిలో ముందంజ‌లో ఉంచేందుకు కృషి చేద్దామ‌ని అన్నారు.