విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదం..బాధిత మత్స్యకారులకు అండగా నిలవాలని అధికారులకు సిఎం ఆదేశం

cm-jagan

అమరావతిః విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగి 40కి పైగా మత్స్యకారుల బోట్లు దగ్ధమయ్యాయి. దాదాపు రూ.50 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా. ఈ ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు.

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారుల బోట్లు దగ్ధం కావడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనస్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని నిర్దేశించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సాయం అందించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫిషింగ్‌ హార్బర్‌ ఘటనపై సీఎంఓ అధికారులతో చర్చించిన సీఎం…. మత్స్యకారుల జీవనాధారం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి జీవితాలను నిలబెట్టేలా తగిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో రాజీ వద్దని స్పష్టం చేశారు.

కాగా, గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే తమ బోట్లను తగలబెట్టారని బాధిత మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.