నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సి55.. రాకెట్‌ ప్రయోగం విజయవంతం

ISRO Launches PSLV-C55 With 2 Singaporean Satellites For Earth Observation From Sriharikota

శ్రీహ‌రికోట‌: పీఎస్ఎల్వీ-సీ55 రాకెట్ ఈరోజు నింగిలోకి దూసుకెళ్లింది. ఆ రాకెట్ ద్వారా సింగ‌పూర్‌కు చెందిన రెండు ఉప‌గ్ర‌హాల‌ను ఇస్రో ప్ర‌యోగించింది. రెండు ఉప‌గ్ర‌హాలను నిర్ధిష్ట కక్ష్య‌లోకి విజ‌య‌వంతంగా ప్ర‌వేశ‌పెట్టారు. 228 ట‌న్నులు ఉన్న పీఎస్ఎల్వీ.. 57వ సారి అంత‌రిక్షంలోకి వెళ్లింది. శ్రీహ‌రికోట‌లో ఉన్న స‌తీస్ ధావ‌న్ అంత‌రిక్ష కేంద్రం నుంచి దీన్ని స‌క్సెస్‌ఫుల్‌గా ప్ర‌యోగించారు. రెండు ఉప‌గ్ర‌హాలు సుమారు 757 కిలోల బ‌రువు ఉన్నాయి. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన మూడ‌వ అతిపెద్ద ప్ర‌యోగం ఇది. TeLEOS-2 ఉప‌గ్ర‌హం ద్వారా ప‌గ‌లు, రాత్రి వెద‌ర్ రిపోర్ట్‌ను ఇవ్వ‌నున్నారు. ఒక మీట‌రు రెజ‌ల్యూష‌న్‌తో ఇమేజ్‌ను రిలీజ్ చేయ‌నున్నారు. టెలియో బ‌రువు 741 కేజీలు. ఇక రెండో ఉప‌గ్ర‌హం లుమిలైట్ ద్వారా హై ప‌ర్ఫార్మెన్స్ డేటాను పంప‌నున్నారు. 16 కిలోల బ‌రువు ఉన్న ఆ శాటిలైట్‌ను ఇన్‌ఫోక‌మ్ రీస‌ర్చ్ ఇన్స్‌టిట్యూట్, శాటిలైట్ టెక్నాల‌జీ అండ్ రీస‌ర్చ్ సెంట‌ర్ డెవ‌ల‌ప్ చేశాయి.