నేడు ‘జగనన్న తోడు’ మూడో విడత రుణాల పంపిణీ

అమరావతి: సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇక జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేయాలని జగన్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. మూడో విడత రుణాలను ముఖ్యమంత్రి జగన్‌ జమ చేయనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు జగన్‌. 510 లక్షల మందికి వడ్డీలేని రుణాలను పంపిణీ చేయనన్నారు. రూ. 510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, తొలి రెండు విడతల వడ్డీ రూ. 16.16 కోట్లు లబ్దిదారులకు జమ చేయనుంది జగన్‌ ప్రభుత్వం.

ఈ పథకం ద్వారా ఎటువంటి పూచీకత్తు లేకుండా ఒక్కో లబ్ధిదారునికి రూ. పది వేల చొప్పున రుణాలు ఇప్పిస్తోంది. లబ్ధిదారుడు ఆ రుణాన్ని 12 నెలల సులభ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఆ రుణంపై వడ్డీని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు చెల్లిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే తొలి విడత 5,35,112 మందికి, రెండో విడత 3,70,517 మందికి.. రెండు విడతల్లో మొత్తం 9,05,629 మందికి రుణాలను అందజేసింది. ఇప్పుడు మూడో విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ విడతలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేసుకునే 3.56 లక్షల మందికి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/