స్కూల్‌ బ్యాగు, బూట్ల నాణ్యతను పరిశీలించిన సీఎం

అమరావతి : సీఎం జగన్ వచ్చే ఏడాది విద్యా కానుక కిట్‌లో భాగంగా అందించనున్న స్కూల్‌ బ్యాగు, బూట్ల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో బూట్లు, స్కూల్‌ బ్యాగులను ముఖ్యమంత్రికి పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్‌, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చూపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికీ ‘జగనన్న విద్యాకానుక’ అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.

ఇందుకు సంబంధించి అదనంగా అయ్యే ఖర్చుకు తగిన నిధులను వెచ్చిస్తోంది. జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు వారి తరగతిని అనుసరించి అందిస్తున్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 3 జతల యూనిఫాం క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, స్కూలు బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నిఘంటువు (డిక్షనరీ) ఇస్తున్నారు. 1 నుంచి 10 వ తరగతి బాలురకు, 1 నుంచి 5వ తరగతి బాలికలకు బెల్టు ఇస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వారికి నోటుపుస్తకాలు అందజేస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ఆరు, ఏడు తరగతులకు 8, ఎనిమిదో తరగతికి 10, తొమ్మిదో తరగతికి 12, పదో తరగతికి 14 నోటుపుస్తకాలు ఇస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/