టాలీవుడ్ ను డ్రగ్స్ కేసు వీడినట్లేనా..?

అంటే అవుననే చెప్పాలి. మొన్నటి వరకు సినీ ప్రముఖులను విచారించిన ఈడీ అధికారులు ఇక ఇప్పుడు ఈ కేసును క్లోజ్ చేయాలనీ చూస్తున్నట్లు అర్ధమవుతుంది. డ్ర‌గ్స్ పెడ్ల‌ర్ కెల్విన్ పై వేసిన చార్జ్ షీట్ లో ప‌లు కీల‌క అంశాల‌ను ఎక్సైజ్ శాఖ ప్ర‌స్తావించింది. ఈ మొత్తం కేసులో బ‌ల‌మైన ఆధారాలేమీ లేవ‌ని అబ్కారీ శాఖ కోర్టుకు తెలిపింది. సెల‌బ్రిటీల‌పై బ‌ల‌మైన‌, త‌గిన‌న్ని ఆధారాలు ఏమీ లేవ‌ని చార్జ్ షీట్ లో పేర్కొంది. వారిపై కెల్విన్ అనేక విష‌యాలు చెప్పినా అవేవీ న‌మ్మ‌శ‌క్యంగా లేవ‌ని చెప్పుకొచ్చింది.

సినీ స్టార్స్ ఫై కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం విచార‌ణ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా ఉంద‌ని పేర్కొంది. సినీ స్టార్స్ తో పాటు విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, హోట‌ల్ నిర్వాకులకు తాను డ్ర‌గ్స్ అమ్మిన‌ట్లు కెల్విన్ పేర్కొన్నార‌ని అబ్కారీ శాఖ కోర్టుకు తెలిపింది. సిట్ బృందం ప‌లువురికి నోటీసులు ఇచ్చి విచారించింద‌ని తెలిపింది. అబ్కారీ శాఖ తెలిపిన దాని ప్రకారం చూస్తే సినీ ప్రముఖులు ఈ డ్రగ్స్ కేసులో ఊపిరి పీల్చుకోవచ్చని అర్ధమవుతుంది.