పద్మవిభూషణ్ రావడం పట్ల చిరంజీవి , వెంకయ్య నాయుడుల స్పందన

రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్రం పద్మ అవార్డ్స్ ను ప్రకటించింది. వీటిలో మెగాస్టార్ చిరంజీవి , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లకు పద్మవిభూషణ్ అవార్డ్స్ దక్కాయి. ఈ అవార్డు పట్ల ఇరువురు స్పందించారు. పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. నవ భారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి తన పురస్కారం అంకితమని పేర్కొన్నారు. తనతో పాటు అవార్డుకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక చిరంజీవి స్పందిస్తూ.. ఈ పురస్కారం రావడంతో ఆనందంతో మాటలు రావట్లేదని అన్నారు. అభిమానులు తన పట్ల చూపిస్తున్న ప్రేమతోనే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. గత 45 ఏళ్లుగా ప్రేక్షకులను అలరించేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. అంతేకాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా భాగమయ్యానని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.