ప్రభాస్ ఫై ప్రశంసలు కురిపించిన చిన్న జీయర్ స్వామి

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి..ప్రభాస్ ఫై ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ తో ఈ నెల 16 న భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో ప్రమోషన్లో భాగంగా మంగళవారం తిరుపతి లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా చిన్న జీయర్ స్వామి హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి మనిషిలోనూ రాముడు ఉంటాడని.. ప్రభాస్ ఇప్పుడు తనలో ఉన్న రాముడిని బయటికి తీసుకువస్తున్నారని చిన్న జీయర్ స్వామి అన్నారు. ‘‘సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన మహనీయులు ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో మాలాంటి వారు పాల్గొనడం ఇదే మొదటిసారి. నిజమైన బాహుబలి రాముడని లోకానికి నిరూపించడం కోసం నేను వచ్చాను. ప్రతి వ్యక్తిలోనూ రాముడున్నాడు. ప్రతి గుండెలోనూ రాముడున్నాడు. ఆ గుండెల్లో ఉండే రాముడిని అందరిలో నుంచి పైకి తేవడానికి శ్రీమాన్ ప్రభాస్ తనలో నుంచి రాముడిని పైకి తీసుకొస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది. మానవ జాతికి మార్గాన్ని చూపించాల్సిన మహనీయుడు శ్రీరామచంద్రుడే. రామచంద్రుడి గురించి రకరకాల మాటలు ఎవరు ఏం చెప్పినా.. రాముడు ఈ మట్టి మీద నడిచి పావనం చేసిన ఒక మహాపురుషుడు. మానవ జాతికి ఆదర్శనమైనటువంటి పురుషుడు ఆయన’’ అని చిన్న జీయర్ స్వామి చెప్పుకొచ్చారు.

‘రాముడు మనందరిలో ఉన్నాడు.. కానీ, మనలో నుంచి ఎవరైనా ఆ రాముడిని పైకి తెచ్చేవాళ్లు కావాలి. ఈరోజు తనలో ఉన్న రాముడిని పైకి తెస్తున్నాడు శ్రీమాన్ ప్రభాస్. రామాయణంలో అరణ్యకాండ, యుద్ధకాండల్లో ఉన్న ప్రధానమైన కథను చరిత్రగా లోకానికి అందించాలనే ఆశతో ఈ సినిమా చేస్తున్నామని చెప్పారు. ఇంతకంటే ఈ లోకానికి మహోపకారం ఇంకొకటి ఉండదు. ఆ ఉపకారం చేస్తున్నారు ఈయన. అలాంటి మంచిపని చేసే మహనీయులని, వ్యక్తులని మరిన్ని మంచికార్యాలు చేయడానికి ఏడుకొండల మీద ఉన్న వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఆయనకి ఉండాలని.. ఇలాంటివి మరిన్ని లోకానికి అందించే శక్తిని భగవంతుడు ఆయని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని ప్రభాస్‌ను ఉద్దేశించి చిన్న జీయర్ స్వామి అన్నారు.

రామాయణాన్ని ఇప్పటి ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో ‘ఆదిపురుష్’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఓం రౌత్‌కు తన ఆశీస్సులు ఆయనకి ఉంటాయని చిన్న జీయర్ స్వామి అన్నారు. ప్రస్తుతం దేశంలోని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతకు రామాయణం చేరువయ్యేలా ఇప్పటి టెక్నాలజీని ఉపయోగించి ఇంత గొప్పగా ‘ఆదిపురుష్’ సినిమా తీయడం ఓం రౌత్ గొప్పతనమని కొనియాడారు. ఈ సినిమాను ఆదరిస్తే ఇది లోకానికి చేరుతుందని అన్నారు. సినిమా మంచి విజయం సాధించాలని చిన్న జీయర్ స్వామి ఆశీర్వదించారు.