నేపాల్‌లో క్యాసినో ఈవెంట్లకోసం సినీ స్టార్స్ కు భారీగానే డబ్బు ముట్టజెప్పిన చీకోటి ప్రవీణ్‌

క్యాసినో నిర్వహిస్తూ కోట్ల రూపాయల హవాలాకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్‌ కు సంబంధించి పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. క్యాసినో పేరుతో కోట్లు కోట్లు సంపాదించడం.. దేశంకానీ దేశంలో, రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఎక్కడైనా తన హవా నడిపించడం ప్రవీణ్ కు బాగా అలవాటు. ఇంతలా ప్రవీణ్‌ హవా సాగడానికి అతని చుట్టూ కొంతమంది మంత్రులు,మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు,డీసీసీబీ ఛైర్మన్‌లు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ , శాండిల్‌వుడ్ ఇలా ఏ వుడ్ అయినా సరే చికోటి ప్రవీణ్‌ పేరు తెలియని హీరో, హీరోయిన్లు ఉండరేమో. ఈవెంట్‌కు రావాలని ఆయన పిలిస్తే.. రాని సెలబ్రేటిలు ఉండరంటే మనోడి సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక నేపాల్‌ లో క్యాసినో ఈవెంట్ల నిర్వహణ వ్యవహారంలో ప్రవీణ్ సినీ స్టార్స్ కు భారీగానే డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తుంది.

మల్లికా శెరావత్‌కు రూ. కోటి, ఈషా రెబ్బకు రూ.40 లక్షలు, గణేష్ ఆచార్యకు రూ.20 లక్షలు, ముమైత్ ఖాన్‌కు రూ.15 లక్షలు, అమీషా పటేల్‌కు రూ.80 లక్షలు, హయాతికి రూ.40 లక్షలు, గోవిందకు రూ.50 లక్షలు చొప్పున చీకోటి ప్రవీణ్ చెల్లించినట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పారితోషకం అందుకున్న తారలకు నోటీసులు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. ఇక పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు..చికోటీ ప్రవీణ్‌, మాధవరెడ్డి ఇళ్లల్లో తనిఖీలు చేశారు. సైదాబాద్‌ ఐఎస్‌సదన్, బోయిన్‌పల్లి, సిటీ శివారులోని కడ్తాల్.. ఇలా 8 ప్రాంతాల్లో దాదాపు 20 గంటల పాటు సోదాలు జరిగాయి. హవాలా ద్వారా వెళ్లిన నగదుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం విచారణ కు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీచేయసంది. చికోటి ప్రవీణ్‌…అధికారుల ముందే అంతా వివరిస్తానని మీడియా కు చెప్పుకొచ్చాడు.