చెస్ ఒలింపియాడ్ను ప్రారంభించిన ప్రధాని మోడీ

చెన్నైలో ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్ క్రీడలను ప్రధాని మోడీ ప్రారంభించారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ ఈవెంట్ మొదలైంది. అనంతరం ప్రధాని మోడీని తమిళనాడు సీఎం స్టాలిన్ సత్కరించారు. చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవంలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. చెస్ కు పుట్టినిల్లుగా చెన్నై వర్ధిల్లుతోందని కొనియాడారు. చెస్ గ్రాండ్ మాస్టర్లకు తమిళనాడు నిలయంగా ఉందని కితాబునిచ్చారు. చెస్ ఒలింపియాడ్ బృంద స్ఫూర్తిని చాటే గొప్ప క్రీడోత్సవం అని మోదీ అభివర్ణించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని పంచెకట్టులో రావడం విశేషం. భుజంపై కండువాతో తమిళ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేందుకు ప్రయత్నించారు.

ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. ప్రపంచస్థాయి చదరంగ క్రీడా సంరంభం చెస్ ఒలింపియాడ్ కు భారత్ ఆతిథ్యమివ్వడం ఇదే ప్రథమం. ఉక్రెయిన్ పై దండయాత్రకు దిగిన రష్యాపై చెస్ సంఘం వేటు వేయడంతో టోర్నీకి ఆతిథ్యమిచ్చే అవకాశం భారత్ కు దక్కింది. దాదాపు 190 దేశాల క్రీడాకారులు ఈ ఒలింపియాడ్ లో పాల్గొంటున్నారు. ఓపెన్‌, ఉమెన్స్ విభాగంలో పోటీలు జరగనున్నాయి. రెండు విభాగాల్లో ఆరు జట్లతో భారత్ బరిలోకి దిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, అర్జున్‌ ఎరిగైసి వివిధ జట్లలో ఆడనున్నారు. ఇక ద్రోణవల్లి హారిక ఎనిమిది నెలల గర్భిణి అయినా..టోర్నీలో ఆడనుండటం విశేషం. చెస్ ఒలింపియాడ్ టోర్నీకి దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ దూరంగా ఉన్నాడు. అతను ఈ సారి భారత జట్లకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. అటు వరల్డ్ చెస్ ఛాంపియన్ కార్ల్‌సన్ నార్వే జట్టుకు ఆడుతూ.. టోర్నీకి స్పెషల్ అట్రాక్షన్ కానున్నాడు.