నిర్భయ కేసులో ఛాయాశర్మ పోరాటం

Chhaya Sharma
Chhaya Sharma

ఏడేళ్ల క్రితం జరగకూడని ఒక సంఘటన దేశరాజధానిలో జరిగింది. గుండెను పిండే సన్నివేశం, వైద్యులు సైతం ఆశ్చర్యపోయే కేసు, పోలీసులకు ఒక పెద్ద సవాలు, కేంద్ర ప్రభుత్వానికి ఈ కేసు ద్వారా బీటలు వారే పరిస్థితి, ఆ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా వ్యతిరేక నినాదాలు, దేశప్రజలందరినీ ఏకం చేసిన ఘోర సన్నివేశం. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన అత్యాచారం. దేశప్రతిష్ఠ దెబ్బతిన్న పరిస్థితి ఒకే ఒక్క అత్యాచారం. భారతదేశంలో రోజుకు ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. వెలుగులోకి రాని ఘోరాలు ఎన్నో. 2012, డిసెంబరు 16న దేశరాజధాని న్యూఢిల్లీలో 23ఏళ్ల అమ్మాయిపై జరిగిన అత్యాచారం. కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఆమె సింగపూర్‌లో చికిత్స పొందు తూ మరణించింది. ఏడేళ్ల పోరాటంలో నిందితులకు త్వరలో ఉరిశిక్ష పడనుంది. ఈ సందర్భంగా నిందితులకు ఇలాంటి శిక్ష పడేందుకు తోర్పడింది ఒక మహిళా ఐపిఎస్‌ అధికారి. ఆమె పేరు ఛాయాశర్మ. ఆమె తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు. ఏడేళ్ల క్రితం డిసెంబరు 16వ తేదీ, అర్ధరాత్రి రెండు గంటలకు ఛాయాశర్మకు ఓ ఫోన్‌ వచ్చింది. ఢిల్లీ నగరశివారుల్లో ఇద్దరు పడి ఉన్నారని. హుటాహుటిగా ఛాయాశర్మ అక్కడకు చేరుకున్నారు. అక్కడ ఆమెకు నిస్సహాయ స్థితిలో, తీవ్రగాయాలతో ఇద్దరు వ్యక్తులు కనిపించారు. ఒంటిపై చిన్న వస్త్రం కూడా లేకుండా ఉన్నారు. వారిని తక్షణం ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు ఛాయాశర్మ. ఈ కేసు తన కెరీర్‌లో మర్చిపోలేని సంఘటన అని చెబుతారామె ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ..ఎన్నో కేసులను ఛేదించిన తనకు ఇది పెద్ద సవాలుగా మారిందన్నారు. ‘వాళ్లెవరో తెలీదు. వాళ్లవద్ద ఎటువంటి గుర్తింపు కార్డులూ లేవు. కళ్లు తెరిచి చెబితేనే వివరాలు తెలుస్తాయి. ఆమెను చూస్తుంటే అత్యాచారానికి గురైందని నాకు అర్ధమైంది. సామూహిక అత్యాచారానికి గురై, ఒళ్లంతా గాయాలతో ప్రాణాపాయస్థితిలో ఉండి కూడా ఆ అమ్మాయి ప్రదర్శించిన ధైర్యం మాటల్లో చెప్పలేనిది అంటారు ఆమె. ఆమె నిజంగా నిర్భయే. ఎందుకంటే అటువంటి సమయంలో ఎవరైనా ఏడుస్తారు. లేదా సానుభూతి కోరుకుంటారు. అయితే నిర్భయ మాత్రం అంత బాధలోనూ ధైర్యాన్ని ప్రదర్శించింది. తనకు తెలిసిన వివరాలన్నింటినీ పూసగుచ్చినట్లు చెప్పింది. పోలీసులకు తనవంతు సాయం చేసింది. వైద్యపరీక్షలకు సహకారం అందించింది. ఈ కేసును ఛేదించడానికి ఆమె చేయూతే సగం కారణమైంది. చనిపోతానని తెలిసి కూడా ధైర్యంగా మాట్లాడింది. చివరిగా ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసిన నేను, ఆమె నుంచి స్ఫూర్తిని పొందాను అంటారు ఛాయాశర్మ. ‘ఆ దుర్మార్గులను వదలొద్దు అంటూ ఆమె కోరిన చివరి కోరికను నెరవేరుస్తానని నా మనసులో నేను ప్రమాణం చేసుకున్నా..ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా..నిందితులను పట్టుకొని కటకటాల వెనక్కి పండడమే కాదు.. వారికి శిక్షపడేవరకు పోరాడతాను అని మనసులో అనుకున్నా.. అంటారామె. ఛాయాశర్మ వారంలోనే నిర్భయ కేసు నిందితులను జైలుకు పంపగలిగారు. మొత్తం ఆరుగురు నిందితులపై 18 రోజుల్లోపు ఛార్జిషీటును దాఖలు చేయించారు. నిర్భయను చూసినప్పుడు ఇదో ఆధారాలు లేని బ్లైండ్‌ కేసుగా అనిపించింది అంటారు ఛాయాశర్మ. ఈ కేసును ఎలా ఛేదించాలో అర్ధం కాదేదామెకు. అయితే ఈ కేసును ఛాయాశర్మ ఒక సవాలుగా తీసుకున్నారు. ప్రత్యేక టీంతో కేసు విచారణ చేసిన ఈమెకు ఆరుగురిలో ఒకడు మాత్రం దొరకలేదు. అతడికోసం చాలా శ్రమపడ్డారు. ఎట్టకేలకు మృగాళ్లందరినీ పట్టుకున్నారు. ఇటువంటి ఆకృత్యాలు జరగడానికి కారణం కేవలం పేదరికం, నిరక్షరాస్యతతోపాటు సరైన కుటుంబంలో పెరగకపోవడమే అని ఛాయాశర్మ భావిస్తారు. ఈ కేసులో ఒక మహిళ ఏమీ సాధించలేదు అనకున్నారందరూ. ఈ సవాలు ప్రతి మహిళకూ ఎదురవుతుందని చెబుతారీమె. తరువాత క్రమేపీ నా విచారణపై నమ్మకం వచ్చింది అందరికీ. ఎవరైనా ఓ అమ్మాయి వచ్చి తనపై అత్యాచారం జరిగింది అని చెబుతుందంటే..ఆ విషయాన్ని నమ్మాలి. ఎందుకంటే ఏ అమ్మాయీ ఈ విషయంలో అబద్ధం చెప్పదు. పోలీసు స్టేషన్లలో ఈ పరిస్థితి మారాలి. అలాగే తల్లిదండ్రులెవరైనా వచ్చి తమ కూతురు కనబడటం లేదంటే వెంటనే ఆ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. అలాకాకుండా ఫిర్యాదు చేయడానికి వచ్చినవారిని అవమానించకూడదని ఛాయాశర్మ చెబుతారు. ఎట్టకేలకు నిందితులందికీ ఉరిశిక్ష ఖాయమైంది. అయితే ఈ శిక్ష అమలులో జ్యాపం రిగేలా ఉంది. నిందితులు ఇటీవల క్యూరేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో వేసారు. అయితే దీన్ని కోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా నలుగురుదోషుల్లో ఒకరు ముకేష్‌సింగ్‌ క్షమాబిక్ష పిటిషన్‌ దాఖలుచేయడంతో ఈనెల 22వ తేదీ అమలుచేయాల్సిన వారి ఉరి శిక్షను ఢిల్లీకోర్టు నిలిపివేసింది. వారికి జారీచేసిన డెత్‌వా రంట్‌ ఉత్తర్వులను సమీక్షించడం లేదని క్షమాబిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున వారి ఉరిశిక్ష అమలుపై స్టేవిధిస్తున్నట్లు తీస్‌ హజారి కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. దీంతో వీరి ఉరిపై ఉత్కంఠత నెలకొంది.
ఉరిశిక్ష ఖాయం!

కాస్త ఆలస్యం అయినా నిందితులు ఉరిశిక్ష నుంచి తప్పించుకోలేరని నిర్భయ తల్లి భావిస్తున్నది. ఏడేళ్లుగా కన్నీరు కారుస్తూనే ఉన్నామని, తమ బిడ్డకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆమె అంటున్నది. ఉరిశిక్ష పడినప్పుడే కూతురు ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ప్రతి మహిళకీ చట్టంపై నమ్మం, గౌరవం పెరుగుతాయి. ఇన్నాళ్లూ, కాళ్లరిగేలా తిరిగా. ఇప్పటికి సమాధానం దొరికింది. నిందితులకు సరైన శిక్షపడింది. చాలా సంతోషంగా ఉన్నా. ఇప్పటికైనా నిర్భయకు న్యాయం జరిగింది. నా కూతురులాంటివాళ్లు బాధితులు చాలామంది మనదేశంలో ఉన్నారు. వారందరికీ న్యాయం జరగాలంటే నిందితులకు సరైన శిక్షపడాల్సిందే. అప్పుడే నిర్భయ ఆత్మమరింత సంతోషిస్తుంది. భవిష్యత్తులో ఆడపిల్లలపై అత్యాచారానికి పాల్పడాలంటేనే భయపడాలి. అలా మన చట్టంలో మార్పులు రావాలి. నిర్భయ కేసులో ఆలస్యం జరిగినా, న్యాయమైన తీర్పు వచ్చింది. దేశవ్యాప్తంగా నిర్భయ కోసం ఎందరో పోరాడారు. ఈ కేసులో చేయూతనందించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. అంతేకాదు..నిర్భయలాంటివారు మరెందరో బాధితులున్నారు. వారందరికీ న్యాయం జరగడానికి కలిసి పోరాడదాం.

ఉరి తీసే అవకాశాన్ని

నాకు ఇవ్వండి..

ఢిల్లీలో జరిగిన నిర్భయ దుర్ఘటన ఎంతోమంది మనసుల్ని కలచివేసింది. నేరస్థులను తక్షణమే శిక్షించాలని దేశవ్యాప్తంగా ఎన్నో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వారిని త్వరలో తీహార్‌ జైల్లో ఉరితీస్తారనే వార్తలూ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపధ్యంలో అంతర్జాతీయ షూటర్‌ వర్తికాసింగ్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు రక్తంతో ఉత్తరం రాసింది. అత్యాచారానికి పాల్పడినవారిని మహిళలతోనే ఉరితీయించాలంటూ డిమాండ్‌ చేసింది. ‘ఆ నలుగురు నేరస్థులకు ఉరి తీయడానికి నన్ను అనుమతించండి. ఒక మహిళ కూడా శిక్షించగలుగుతుందని అందరికీ తెలుస్తుంది. అత్యాచారాలకు పాల్పడినవారికి గుణపాఠం అవుతుంది. మహిళా ఎంపిలు, నటులు తనకు మద్దతు తెలపాలని ఆమె కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/