టీచర్‌ నుంచి న్యాయమూర్తిగా..

LAW
LAW

తండ్రి గుమాస్తాగా పనిచేస్తే పిల్లలు అదే వృత్తిలో స్థిరపడాలని లేదు. తల్లిదండ్రులు డాక్టర్లు అయితే పిల్లలు కూడా డాక్టర్లు కావాలని కలలు కంటారు. ఎందుకని, ఆ వృత్తి సమాజంలో గొప్పది. అలాగే గుమాస్తా ఉపాధి బతికేందుకు కానీ, ఉన్నతంగా ఎదగాలని కోరుకునేవారు అదే వృత్తిని స్వీకరించాలని కోరుకోరు. సరిగ్గా అర్చనలో ఇదే ఆలోచన వచ్చింది.
బిహార్‌లోని సోనేపూర్‌ కోర్టులో అర్చన తండ్రి గౌరీనందన్‌ గుమస్తాగా విధులు నిర్వహించేవాడు. బాల్యంలో తండ్రితోపాటు అప్పుడప్పుడు కోర్టుకు వెళ్లేదామె. ఆ కోర్టులోకి వచ్చే న్యాయమూర్తులందరికి సహాయకారిగా ఆయన చేసే పనులు అర్చన మనసుకు కష్టం కలిగించేవి. అప్పుడే పెద్ద చదువులు చదువుకొని తండ్రి సేవలందించే న్యాయమూర్తులా గుర్తింపు సాధించాలనుకుంది. కానీ పరిస్థితులు ఆమె లక్ష్యం చేరుకునేందుకు సహకరించలేదు. ఇంటర్‌కి రాకముందే తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో కుటుంబం ఆర్థిక ఆసరాను కోల్పోయింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అటుంచి, కనీసం ఇంటి అవసరాలు తీరలేని పరిస్థితి ఏర్పడింది. అర్చన కల నెరవేరడానికి ఆమె తల్లి చేయూత అందించింది. స్నేహితులు, బంధువుల అండతో ఆమెను చదివించింది. పాట్నా, శాస్త్రీనగర్‌ ప్రభుత్వ పాఠశాలలో ఇంటరు పూర్తిచేసి, పాట్నా విశ్వవిద్యాలయంలో ఉన్నతాభ్యాసానికి వెళ్లింది. ‘నాన్న ఉద్యోగం చేసినప్పుడు చిన్న గదిలో ముగ్గురం ఉండేవాళ్లం. ఆయన చనిపోయిన తరువాత మా పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పైచదువులకు అమ్మను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, అక్కడితే ఆపేసి, నేను చదివిన పాఠశాలలోనే కంప్యూటర్‌ ఉపాధ్యాయురాలిగా చేరా. ఆ తరువత పాట్నా మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న రాజీవ్‌ రంజన్‌తో పెళ్లంది. మాకు బాబు పుట్టాడు. చదువుకోవాలని ఉన్నా కొనసాగించలేకపోయానని బాధపడేదాన్ని. చివరకు నా భర్తకు ఈ విషయం చెప్పా. చిన్నప్పటి నుంచి జడ్జి అవ్వాలనే నా కలను ఆయన అర్ధం చేసుకున్నాడు. నాకు పూర్తి సహకారం అందించాడు. అప్పటికే మా అబ్బాయికి అయిదేళ్లు. అత్తింటివారు ఈ విషయంలో చేయూతనిచ్చి ప్రోత్సహించారు. బాబుని అత్తింట్లో అప్పజెప్పి, పుణెలో ఎల్‌ఎల్‌బి చదవడానికి వెళ్లా. బాబును వదిలేసి వచ్చి చదువుకుంటున్నా అని అప్పుడప్పుడు ఏడుపు వచ్చేది. ఆ సమయంలో నా లక్ష్యాన్ని గుర్తు చేసుకునేదాన్ని పూర్తిగా చదువుపై ధ్యాస ఉంచేదాన్ని. ఆ తరువాత బిఎంటి లా కళాశాలలో అయిదేళ్లక్రితం ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశా. అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి జ్యుడిషియల్‌ సర్వీస్‌ పరీక్షలకు హాజరుకావడానికి శిక్షణాతరగతుల్లో చేరాను. పరీక్షలు రాశాను. మొటిసారి ఫెయిల్‌ అయ్యా. కొంత నిరుత్సాహడినా, తిరిగి రాసి సాధించా. దీని వెనుక అమ్మ, నా భర్త సహకారం ఎంతో ఉంది. న్యాయమూర్తిగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నా.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/