ఛత్తీస్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం..12 మంది మృతి

ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు ఎంతోమందిని బలి తీసుకుంటున్నాయి. జాగ్రత్త..జాగ్రత్త అంటూ పదే పదే చెపుతున్న కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా అమాయకులు చనిపోతున్నారు. తాజాగా ఛత్తీస్​గఢ్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. దుర్గ్‌ జిల్లా ఖాప్రి గ్రామ సమీపంలో ఓ బస్సు బోల్తాపడి ముగ్గురు మహిళలతో సహా మొత్తం 12 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 14 మందికి గాయాలయ్యయి. వారంతా ఓ డిస్టిల్లరీ సంస్థ ఉద్యోగులుగా గుర్తించారు. పని ముగించుకుని ఆఫీస్ బస్సు లో ఇళ్లకు తిరిగి వెళ్తుండగా రాత్రి ఎనిమిదిన్నర సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. 40 అడుగుల భారీ గుంతలో బస్సు పడ్డ వెంటనే 11మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో మరొకరు చికిత్స పొందుతూ దుర్మరణం పాలయ్యారు.

దుర్గ్‌ బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా పోస్టుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు సాధ్యమైన మేర సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణు దేవ్ సాయి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించనున్నట్లు తెలిపారు.