‘చీనాబ్ బ్రిడ్జి’ పూర్తి.. వీడియో షేర్ చేసిన మంత్రి

ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన ‘చీనాబ్ బ్రిడ్జి’కి సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ నది పై భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను ఇక్కడ నిర్మిస్తుంది. సుమారు రూ.552 కోట్ల అంచనా వ్యయంతో కొంకణ్ రైల్వే ఈ వంతెనను నిర్మించింది.

బారాముల్లా-జమ్మును కలిపే ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడం తో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి పడుతున్న ఆరున్నర గంటల సమయం సగానికి తగ్గిపోతుంది. ప్రస్తుతం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉన్న ఈఫిల్‌టవర్ కన్నా 35 మీటర్లు ఎక్కువ.భూకంపాలు, బలమైన ఈదురుగాలులను తట్టుకునేలా దీని నిర్మాణం జరిగింది. 2002 లోనే దీని నిర్మాణం ప్రారంభమైనా బలమైన ఈదురుగాలులను తట్టుకోగలుగుతుందా? అన్న అనుమానంతో 2008 లో నిర్మాణం నిలిచిపోయింది. ఆ తరువాత రెండేళ్లకు డిజైన్‌పై సందేహాలు వీడడంతో 2010లో నిర్మాణం మళ్లీ మొదలైంది. దీని నిర్మాణానికి 25వేల టన్నుల ఇనుము అవసరమవుతుందని అంచనా. ఇంద్రధనుస్సు (ఆర్క్) ఆకారంలో నిర్మిస్తున్న ఈ వంతెన విడిభాగాలను చీనాబ్ నది పక్కనే తయారుచేసి రెండు కేబుల్ కార్ల సాయంతో వంతెనకు జత చేసారు.